Sunday, May 3, 2015

Punch dialogue in athadu


I liked this article in sakshi news paper...


పంచ్ శాస్త్ర
దర్శకులే రచయితలయ్యాక పంచ్‌లు పవర్‌ఫుల్ అయ్యాయి. త్రివిక్రమ్‌దైతే వెరీమచ్ కార్డియల్ పంచ్. తొడ కొట్టించడు. మీసం మెలి తిప్పించడు. వెనుక గుండ్లు, సౌండ్లు పెట్టడు. వింజామరలా పంచ్‌లు విసురుతాడు. ఉద్వేగపు అగ్నిపర్వతానికి సెలైన్సర్ అమర్చి పేల్చినట్లు కూల్‌గా స్పిల్ అవుతుందా పంచ్! ‘అతడు’ సినిమానే తీస్కోండి. మహేశ్‌బాబు ‘యుద్ధానికి’ బయల్దేరి వెళ్లబోయే ముందు త్రిష పరుగున వచ్చి ‘‘నేనూ వస్తాను’’ అని అతడిని అల్లేసుకుంటుంది.

మహేశ్‌బాబు మృదువుగా త్రిషను విడిపించుకుని ‘‘నేనే వస్తాను’’ అని చెప్పి వెళ్లిపోతాడు. ప్రేక్షకుల హృదయాన్ని కదిలించిన పంచ్ ఇది.
       
అసలు పంచ్‌కి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సన్నివేశం నుంచే! ఎంత మామూలు డైలాగునైనా సన్నివేశం పంచ్ డైలాగ్‌గా మార్చేయగలదు. అందుకు చక్కటి ఉదాహరణే ‘‘నేనే వస్తాను’’ అనే డైలాగ్. అలా సన్నివేశం, పంచ్ డైలాగ్ ఒకదాన్ని ఒకటి హిట్ చేసుకుంటాయి. ‘అతడు’ సినిమాలో ‘నేనే వస్తాను’’ అనే డైలాగ్ పంచ్ డైలాగ్‌గా ఎస్టాబ్లిష్ అవడానికి సన్నివేశం ఎలా తోడ్పడిందో మీరే చూడండి.
 
సీన్:
 సీబీఐ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ అండ్ టీమ్ మహేశ్‌బాబును వెతుక్కుంటూ నాజర్ ఇంట్లోకి చొరబడి గాలిస్తుంటారు. ‘‘ఆ... బై ది బై మూర్తిగారూ మీ ఇంట్లో ఉన్నాడే ఆ కుర్రాడు. వాడు మీ మనవడు కాదు. వాడి పేరు నందు. హి ఈజ్ ఎ ప్రొఫెషనల్ కిల్లర్. అపోజిషన్ లీడర్ శివారెడ్డి హత్య కేసులో వాడికోసం వెతుకుతున్నాం’’ అని చెప్తాడు.
 నాజర్ బ్లాంక్‌గా ఉండిపోతాడు. సీబీఐ వాళ్లు వెళ్లిపోయాక మహేశ్‌బాబు ఇంట్లోకి వస్తాడు. ఇంట్లో అందరూ అతడిని దోషిలా చూస్తుంటారు. నానా మాటలు అంటారు. మహేశ్‌బాబు నేరుగా నాజర్ దగ్గరికి వెళతాడు. ఆయన ఎదురుగా మోకాళ్లపై కూర్చొని మెల్లిగా చెప్పడం మొదలుపెడతాడు.

‘‘నిజం చెప్పే ధైర్యం లేనోడికి అబద్ధం చెప్పే హక్కు లేదు. నాకు ధైర్యం ఉంది. అందుకే పార్థు లేడనే నిజం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. కానీ ఆవిణ్ణి చూశాక (పార్థు తల్లిని చూపిస్తూ) పార్థు రాలేడని చెప్పాలనుకున్నాను. మిమ్మల్ని చూశాక ఆ మాట కూడా చెప్పలేక పోయాను. అబద్ధం ఆడాను. అబద్ధం మాత్రమే ఆడాను. మోసం చేయలేదు’’ అంటాడు మహేశ్‌బాబు. (‘‘రెంటికీ పెద్ద తేడా ఏంటో’’ అంటాడు అక్కడే ఉన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం వ్యంగ్యంగా...) ‘‘నిజం చెప్పకపోవడం అబద్ధం. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. నేను పార్థు అని అబద్ధం చెప్పాను. నేనే పార్థు అవ్వాలని మోసం చేయలేదు.

పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నా వెనక్కి తిరిగి రాటానికి కారణం ఒకటే... ఈ ఇంట్లో నేను సమాధానం చెప్పాల్సిన మనుషులు ఇద్దరున్నారు. ఒకళ్లు మీరు. ఇంకొళ్లు... (పాజ్)... అని ఆగినప్పుడు త్రిష వైపు కెమెరా తిరుగుతుంది. ‘‘వచ్చాను. చెప్పాను. ఇంక మీ ఇష్టం’’ అంటాడు (నాజర్ వైపు చేతులు చాస్తూ) మహేశ్‌బాబు.
 
కనెక్టింగ్ సీన్:
నాజర్ మహేశ్‌బాబుని చెయ్యి పట్టుకుని పై గదిలోకి తీసుకెళతాడు.
‘‘నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. సమాధానం చెప్తావా?’’ అంటాడు. ‘‘ఎవడో రైల్లో పోలీస్ కాల్పుల్లో చనిపోతే నీ దారిన నువ్వు పారిపోకుండా, వాడి ఇల్లు వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వచ్చావు? వాళ్ల పొలం సమస్యల్లో ఉంటే నువ్వెందుకు తీర్చావ్? వాళ్ల పిల్ల పెళ్లంటే నువ్వెందుకు డబ్బులిచ్చావ్? వాళ్లు తిడితే ఎందుకు పడ్డావ్? ఏమీ చెయ్యలేని నాలాంటి ముసలాడి ముందు తలొంచుకుని మోకాళ్ల మీద ఎందుకు కూర్చున్నావ్? ఆ.. అందుకే నువ్వే పార్థు. నువ్వే నా పార్థువి’’ అంటాడు.
 
‘‘నేను నిన్నేమీ అడగను. అడిగితే, నాయుడు లాంటి మనిషిని ఎలా ఒప్పించావని పొలంలోంచి కంచె తీయించేసిన రోజే నిన్ను అడిగుండాల్సింది. పాతికేళ్ల వయసులో పది లక్షలు చెక్కిచ్చావంటే, ‘ఏం చేస్తున్నావు నువ్వు’ అని ఆరోజే నేను అడిగుండాల్సింది. అప్పుడడగలేదు. ఇప్పుడు అడిగే అర్హత లేదు’’ అంటాడు.
 
గోడపై తుపాకీని అందుకుని -
‘‘ఇది నా కొడుక్కు నేను కొనిచ్చాను. అప్పుడు వాడి ప్రాణాలు తీసింది. ఇప్పుడు నీ ప్రాణాలు కాపాడుతుంది. నువ్వు నేరం చేశావని వాడెవడో అన్నాడు. ఇప్పుడు యుద్ధం చెయ్యమని నేను చెప్తున్నాను’’ అంటాడు.. తుపాకీని మహేశ్‌బాబు చేతికి అందిస్తూ. ‘‘వెళ్లు. గెలిస్తే రా. గెలవక పోతే నువ్వేమైపోయావో అనే నిజం నాకు తెలియనివ్వకు. ఈ వయసులో నాక్కావలసింది అబద్ధాలు, నిజాలు కావు. జ్ఞాపకాలు’’ అంటాడు.
       
 మహేశ్‌బాబు వంగి నాజర్ కాళ్లకు దండం పెడతాడు. ‘‘జాగ్రత్త’’ అని ఆశీర్వదిస్తాడు నాజర్.
 ఇదంతా వింటున్న త్రిష, మహేశ్‌బాబు గదిలోంచి బయటికి రాగానే ఉద్వేగంతో ఒక్కసారిగా పరుగున వెళ్లి మహేశ్ బాబుని చుట్టేసుకుంటుంది. గట్టిగా పట్టుకుని వదలిపెట్టేది లేదన్నట్లు ఏడుస్తుంది. ‘‘నేనూ వస్తాను’’ అంటుంది.మహేష్‌బాబు త్రిషను మెల్లగా విడిపించుకుని తల అడ్డంగా ఊపుతూ ‘‘నేనే వస్తాను’’ అంటాడు. అని వెళ్లిపోతాడు. సన్నివేశం మలిచిన పంచ్ ఇది. పదాలను మార్చకుండా భావాలను మలిచారు త్రివిక్రమ్. అందుకే అంత పెద్ద హిట్ అయింది.

Saturday, April 18, 2015

Yaksha prasnalu

మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షప్రశ్నలకు ఒక ప్రత్యేక స్థానముంది. పాండవులు నీటి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో ముందు నకులుడికి ఒక సరస్సు కనిపిస్తుంది. దానిలో దాహం తీర్చుకొని- నీటిని తన అన్నలకు తీసుకువెళ్లాలనుకుంటాడు. అప్పుడు ఒక అశరీరవాణి- ుూనా ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే నీటిని తాగు. లేకపోతే విగతజీవివి అవుతావు’’ అని హెచ్చరిస్తుంది. దీనిని పట్టించుకోకుండా- నలుడు నీటిని తాగి విగతజీవి అయిపోతాడు. అతనిని వెతుక్కుంటూ వచ్చిన సహదేవుడు, అర్జునుడు, భీముడు కూడా నీటిని తాగి విగతజీవులవుతారు. చివరకు ధర్మరాజు తన తమ్ముళ్లను వెతుక్కుంటూ వెళ్తాడు. అశరీరవాణి మాటలు విని- ప్రశ్నలకు సమాధానం చెబుతాడు. ఆ ప్రశ్నలు, జవాబుల సమాహారమే యక్ష ప్రశ్నలు.. అవి క్లుప్తంగా...
1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు ?
బ్రహ్మం
2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు?
దేవతలు
3. సూర్యుని అస్తమింపచేయునది ఏది?
దర్మం
4. సూర్యుడు దేని ఆధారంగా
నిలచియున్నాడు?
సత్యం
5. మానవుడు దేని వలన శ్రోత్రియుడగును?
వేదం
6. దేని వలన మహత్తును పొందును?
తపస్సు
7. మానవునికి సహాయపడునది ఏది?
ధైర్యం
8. మానవుడు దేని వలన బుద్ధిమంతుడగును?
పెద్దలను సేవించుటవలన
9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?
అధ్యయనము వలన
10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి?
తపస్సు వలన సాధుభావం, శిష్టాచార భ్రష్టతవం వల్ల
11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
మృత్యుభయం వలన
12. జీవన్మృతుడెవరు?
దేవతలకూ, అతిథులకూ, పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు
13. భూమికంటే భారమైనది ఏది?
జనని
14. ఆకాశం కంటే పొడవైనది ఏది?
తండ్రి
15. గాలికంటే వేగమైనది ఏది?
మనస్సు
16. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది?
ఇతరులు తనపట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టివానికి సజ్జనత్వం వస్తుంది.
17. తృణం కంటే దట్టమైనది ఏది?
చింత
18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది?
చేప
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?
అస్త్రవిద్యచే
20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
యజ్ఞం చేయటం వలన
21. జన్మించియు ప్రాణం లేనిది?
గుడ్డు
22. రూపం ఉన్నా హృదయం లేనిదేది?
రాయి
23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది?
శరణుజొచ్చిన వారిని రక్షించకపోవడం వలన
24. ఎల్లప్పుడూ వేగం గలదేది?
నది
25. రైతుకి ఏది ముఖ్యం?
వాన
26. బాటసారికి, రోగికి, గృహస్థునకు,
చనిపోయిన వారికి బంధువులెవ్వరు?
స్వార్థం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు
27. ధర్మానికి ఆధారమేది?
దయదాక్షిణ్యం
28. కీర్తికి ఆశ్రయమేది?
దానం
29. దేవలోకానికి దారి ఏది?
సత్యం
30. సుఖానికి ఆధారం ఏది?
శీలం
31. మనిషికి దైవిక బంధువులెవరు?
భార్య/భర్త
32. మనిషికి ఆత్మ ఎవరు?
కుమారుడు
33. మానవునకు జీవనాధారమేది?
మేఘం
34. మనిషికి దేనివల్ల సంతసించును?
దానం
35. లాభాల్లో గొప్పది ఏది?
ఆరోగ్యం

Tuesday, December 23, 2014

Paying homage to film director K balachander

బాలచందర్ అంతులేని కధ:
బాలచందర్ గారికి అనారోగ్యం అని వార్త చదివినప్పటి నుంచి మనసు ఏదో కీడు శంకించింది. ఆయనకి ఏమి కాకూడదు అనే బలమైన కోరిక, ఏదైనా అవుతుందో ఏమో అని తెలియని భయం....మళ్ళీ కొద్దిరోజుల తరువాత ఆయనకి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసి కొంత సంతోషం....ఇవన్నీ ఇంకొన్ని రోజుల్లో ఆవిరైపోబోతున్నాయి అని ఊహించని అనుభవం ఈరోజు జరిగింది.
ఆయన ఇక మన మధ్య లేరు అనే వార్త చాలా భాదించింది.
రజనీకాంత్, కమల హాసన్ లాంటి గొప్ప నటులను సూపర్ స్టార్స్ ని పరిచయం చేసిన ఘనత ఆయనదే.
అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం ,అలాంటి వారిని ఈ సంవత్సరం లో కోల్పోవడం మన దురదృష్టం.

గొప్ప వ్యక్తులైన అక్కినేని , బాపు, మరెంతో మంది లెజెండ్స్ ని ఈ 2014 సంవత్సరం మన నుంచి దూరం చేసి , చివర్లో బాలచందర్ గారిని కూడా తనలో కలిపేసుకుని చలనచిత్ర పరిశ్రమకి తీర్చలేని లోటు కలిగించింది.

బాలచందర్ గారి గురించి మాట్లాడే స్థాయి గాని, అనుభవం గాని లేని నేను, ఆయన గురించి ఇవాళ రాయడానికి కారణం ఆయన ఈరోజు మన ప్రపంచం నుంచి నిష్క్రమించడమే ...!
మొట్టమొదటి సారి నాకు బాలచందర్ గారిని పరిచయం చేసిన సినిమా “అంతు లేని కధ”.
కేబుల్ టి.వి. వచ్చిన కొత్తల్లో ఈటివి లో ఈ సినిమా చూశాను. అప్పుడు నేను సిక్స్త్ క్లాస్.
హీరోయిజం సినిమాలు మాత్రమే చూసి పెరిగిన నాకు, మొదటి సారి ఆ సినిమా పెద్ద షాక్.
జయప్రద లాంటి హీరోయిన్ ని పెట్టి, ఆయన తీసిన లేడీ ఓరియెంటడ్ సినిమా అది.  చివరి సీన్ వరకు ఏం జరుగుతుందా అని టెన్షన్ తో చూసిన సినిమా అది. క్లైమాక్స్ లో కూడా ఆమెకి పెళ్ళి అవ్వకుండా ఇంకా అలా మిగిలిపోవడం తో నిరాశ కలిగింది, అయినా ఆ కధ ని అర్ధం చేసుకునే వయసు అప్పుడు నాకు లేదు. తరువాత మరిన్ని సార్లు ఆ సినిమా చూసి అతను ఎంత అడ్వాన్స్డ్ గా ఆలోచించే వారో అర్ధం చేసుకున్నా.
దాని తరువాత కమల హసన్ నటించిన “ మరో చరిత్ర” చూశాను.  అప్పుడు ఆయన గొప్ప దర్శకుడు అని తెలిసింది.
దాని తరువాత ఒక్కొక్కటిగా ఆయన సినిమాలు చూస్తూనే ఉన్నాను. “ఇది కధ కాదు”, “ ఆకలి రాజ్యం”, “రుద్రవీణ” ఇలా వరస పెట్టి ఆయన సినిమాలు అన్నీ చూశాను. తమిళ్ లో విడుదలై తెలుగు లోకి డబ్బింగ్ కాని సినిమాలు కూడా చూశాను.

గొల్లపూడి శ్రీనివాస్ గారి స్మారక మెమోరియల్ అవార్డు ని “తారే జమీన్ పర్” సినిమాకు గాను అమీర్ ఖాన్ కి అందించడానికి వచ్చిన బాలచందర్ గారిని చెన్నై కామరాజ్ మెమోరియల్ హాల్ లో మొదటిసారి చూశాను.
అమీర్ఖాన్ ని పొగుడుతూ మాట్లాడుతూ “ ఐ యాం ఏ స్మాల్ ఫిలిం డైరెక్టర్ ఫ్రం సౌత్ ఇండియా” అనగానే , అమీర్ఖాన్ లేచి పరిగెత్తుకుని వచ్చి కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టడం , కన్నీళ్లు పెట్టుకొని “మీ సినిమాలు చూస్తూ పెరిగాను సర్” అనడం కళ్లారా చూశాను. ఎన్నో గొప్ప సినిమాలు తీసినా గొప్పలకి పోని నిగర్వి.

“ విన్నైతాండి వరువాయ “ సినిమా (తెలుగులో ఏ మాయ చేసావే)  తీసిన గౌతం మీనన్ కి ఒక లెటర్ రాసి ఈరోజు నుంచి నా “మరోచరిత్ర” సినిమాని తీసేసి అతి గొప్ప లవ్ స్టోరీస్ లో ఈ సినిమా ని పెడతారు అని చెప్పడం ఆయనలో గొప్పతనానికి మరో కోణం ..   

కధని చెప్పడం లో ఒక విశిష్టత , ఒక గొప్ప శైలి. అందరు రచయితలు కంటే ముందుగానే సమాజం లో జరగబోయే మార్పులని పసిగట్టి, పదేళ్ళ ముందుగానే సినిమాలు తీసి కొన్ని విమర్శలకి కూడా గురయ్యారు.
కాంట్రవర్సియల్ సినిమాలు ఎన్నో తీసి ప్రేక్షకుల తో ఒప్పించారు.అవన్నీ ఈరోజు క్లాసిక్ సినిమాలు.
తరువాత బుల్లి తెర మీద కూడా “ రహస్యం”, “ గుప్పెడు మనసు”, “ మర్మ దేశం” లాంటి మంచి సీరియల్స్ ని అందించారు. ఆయన గొప్ప దర్శకుడే కాదు....దార్శనికుడు కూడా. ఎంతో మంది ఫిలిం మేకర్స్ ని ఇన్ స్పయిర్ వ్యక్తి.
“ఇది కధ కాదు” ..... ఆయన చలన చిత్ర విజయాలే “ మరో చరిత్ర”.....ఆయన సినిమాలతో భారతీయ చలన చిత్రపరిశ్రమది ఒక “అంతులేని కధ..”
“ఆకలి రాజ్యపు “ సమాజం లో అసమానతల మీద ఎన్నో గొప్ప చిత్రాలను సృష్టించడానికి ఆయన శ్రుతి చేసిన “రుద్రవీణ “ ఆయన జీవితం

ఈరోజు మీరు మా మధ్య లేక పోయినా, మీ సినిమాలు మరిన్ని తరాలకు స్పూర్తినిస్తాయి సర్,


బాలచందర్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని మనస్పూర్తిగా ప్రార్ధిస్తూ..