తెలుగు తల్లి
ముక్కలైపోయింది. తెలుగు తల్లి ని ఐ.సి.యూ లో గొంతు నులుమి చంపేశారు.నా తల్లి
వయస్సు 56 ఏళ్లు. ఆంధ్రప్రదేశ్ ....ఇప్పుడొక చరిత్ర...ఒక జ్ఞాపకం.
తెలుగు తల్లి ఒక వృద్ధ
నారి...
తెలుగు భాష మరికొద్ది
సంవత్సరాలలో కనుమరుగైపోయే బాష.
తెలుగుతల్లి... కన్న
బిడ్డలు కొట్టుకుంటుంటే ఏమీ చెయ్యలేక చేష్టలుడిగిన ముసలి ముగ్ధ...
అసమర్ధ పాలకుల చేతిలో పడి
మరణించిన భారత మాత ముద్దుల బిడ్డ.
తల్లి ఆత్మ గౌరవాన్ని
ఎక్కడో తాకట్టు పెడుతుంటే మౌనంగా కన్నీళ్లు
పెట్టుకున్న గొడ్రాలు.
డిల్లీ నడిరోడ్డు మీద పడి
“నన్ను రక్షించండి” అని బావురుమన్న మరో “నిర్భయ”.
కన్న బిడ్డలే నువ్వు
మాకొద్దు, నువ్వు మా తల్లివి కాదు అంటే ఏమీ చెయ్యలేక మూగబోయి నిలబడిపోయిన
నిస్సహాయురాలు.
ఆసుపత్రి లో “నీకేం
కాదు..మేము రక్షిస్తాం” అని అందరూ అంటుంటే విని మురిసిపోయిన తల్లి, బిడ్డల వివాదాల
లో చిక్కి,తుదిశ్వాస వదిలింది. దీనిని మనం
పండగ చేసుకోవాల్సిన రోజు,ఎందుకంటే తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి
,గెలిచామని, ఏదో సాధించామని, ఎన్నో పదవులు అలంకరించబోతున్నామని చంకలు కొట్టుకుంటున్న రాజకీయ దురంధరులు పన్నిన
వలలో చిక్కి అంతమైపోయిన...నా తెలుగుతల్లి
కి ఇదే నివాళి.
ఈ కుహనా రాజకీయ
నాయకులు,మేధావులు కలిసి తమ రాజకీయ లబ్ది కోసం, పదవుల కోసం, స్వార్ధం కోసం నా
తల్లిని చంపేశారు. అన్నదమ్ములని వేరు చేసేశారు, మరిన్ని కక్షలకి, కార్పణ్యాలకి
దారి తీశారు. దీనికి సమాధానం ఏ రాజకీయ పార్టీ చెబుతుంది. ఏ మేధావి ఈ భాధ్యత భుజాన
వేసుకుంటాడు.
కానీ ఎంతో మంది
త్యాగమూర్తులు ఫలితంగా, తెలుగు బాష మాట్లాడే వాళ్లందరూ ఒక రాష్ట్రం గా ఏర్పడ్డ
తెలుగు జాతి, ఆంధ్రరాష్ట్రం ముక్కలైపోయింది. స్వార్ధ రాజకీయాల కోసం బలైపోయింది.
చాలా మంది మేధావుల తెలివితేటలు, రాజకీయ చాకచక్యం , చాతుర్యాల మధ్య నలిగి సమిధై
పోయింది.
అన్నదమ్ములు కొట్టుకుంటుంటే
వద్దని వారించాల్సిన పెద్దన్న లాంటి కేంద్ర ప్రభుత్వం, జనం ఏమయిపోయినా పరవాలేదు
అనే విధంగా ఒంటేద్దుపోకడ నిర్ణయం తీసుకుని, తన నిర్ణయాన్ని సమర్ధించడానికి ఒక
కమిటీని నియమించుకుంటే, వాళ్ళు తమ రాజకీయ ప్రయోజనాల కోసం విడదీసేస్తే , ఈ
ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏం బావుకుందామని ఆశించి ఈ పని చేసిందో, తెలుగు
ప్రజలందరికీ ఈ పాటికే అర్ధమయ్యుంటుంది.
కనీసం పొరుగు రాష్ట్రం
వాడికి వున్న ఆత్మాభిమానం కూడా మన ప్రజలకి లేకపోవడం చింతించవలసిన విషయం.
ఏది ఏమైనా “ నన్ను చంపకండి”
అని మొరపెట్టుకున్న తెలుగు తల్లి మొర ఏ ఒక్క బిడ్డా వినలేకపోయాడు.
కళ్ళున్నా గుడ్డి వాళ్ళు,
చెవులున్నా చెవిటి వాళ్ళు, నోరు వున్నా మూగ వాళ్ళు, చేతిలో అధికారం వున్నా
అసమర్ధులు, చేతకానివాళ్ళు అయిపోయారు. తెలుగు తల్లిని సమూలంగా నాశనం చేసేసారు...
రండి...ఏమీ చెయ్యలేక
చేష్టలుడిగిన మేదావుల్లారా, మధ్యతరగతి ప్రజలారా...రండి.
మన ఆవేశాన్ని, చేతకాని
తనాన్ని ఇలా ఎవరిమీదో రుద్దేద్దాం, ఎక్కడో రాసేద్దాం , ఈరోజు తెల్లారితే చాలు
అనుకుందాం. మన రాష్ట్రం ముక్కలైనా, రావణకాష్టమైనా పట్టించుకోకుండా మన జీతం, మన
జీవితం అనుకుంటూ పొరుగు రాష్ట్రానికో, పొరుగు దేశానికో పారిపోయి బతికేద్దాం. ఈ దేశం బాగు పడదు అని లెక్చర్లు దంచేద్దాం.
ఎక్కడున్నా మళ్ళీ
ఎలక్షన్లకి ఏ బస్సో, రైలో ఎక్కి మన ఊరికి పోయి మన ప్రజానేతలని, మన దశ,దిశానిర్దేశం
చేసే ఈ స్వార్ధ రాజకీయ నాయకులకి ఓటు వేసి గెలిపిద్దాం.
జై బోలో భారత మాతాకీ,
..జై...
కేంద్ర ప్రభుత్వానికీ జై,
అధిష్టానానికి జై....జయహో ...
No comments:
Post a Comment