Wednesday, July 31, 2013

Telugu thalli


తెలుగు తల్లి ముక్కలైపోయింది. తెలుగు తల్లి ని ఐ.సి.యూ లో గొంతు నులుమి చంపేశారు.నా తల్లి వయస్సు 56 ఏళ్లు. ఆంధ్రప్రదేశ్ ....ఇప్పుడొక చరిత్ర...ఒక జ్ఞాపకం.
తెలుగు తల్లి ఒక వృద్ధ నారి...
తెలుగు భాష మరికొద్ది సంవత్సరాలలో కనుమరుగైపోయే బాష.
తెలుగుతల్లి... కన్న బిడ్డలు కొట్టుకుంటుంటే ఏమీ చెయ్యలేక చేష్టలుడిగిన ముసలి ముగ్ధ...
అసమర్ధ పాలకుల చేతిలో పడి మరణించిన భారత మాత ముద్దుల బిడ్డ.
తల్లి ఆత్మ గౌరవాన్ని ఎక్కడో  తాకట్టు పెడుతుంటే మౌనంగా కన్నీళ్లు పెట్టుకున్న గొడ్రాలు.
డిల్లీ నడిరోడ్డు మీద పడి “నన్ను రక్షించండి” అని బావురుమన్న మరో “నిర్భయ”.
కన్న బిడ్డలే నువ్వు మాకొద్దు, నువ్వు మా తల్లివి కాదు అంటే ఏమీ చెయ్యలేక మూగబోయి నిలబడిపోయిన నిస్సహాయురాలు.
ఆసుపత్రి లో “నీకేం కాదు..మేము రక్షిస్తాం” అని అందరూ అంటుంటే విని మురిసిపోయిన తల్లి, బిడ్డల వివాదాల లో చిక్కి,తుదిశ్వాస వదిలింది.  దీనిని మనం పండగ చేసుకోవాల్సిన రోజు,ఎందుకంటే తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి ,గెలిచామని, ఏదో సాధించామని, ఎన్నో పదవులు అలంకరించబోతున్నామని  చంకలు కొట్టుకుంటున్న రాజకీయ దురంధరులు పన్నిన వలలో చిక్కి అంతమైపోయిన...నా  తెలుగుతల్లి కి ఇదే నివాళి.
ఈ కుహనా రాజకీయ నాయకులు,మేధావులు కలిసి తమ రాజకీయ లబ్ది కోసం, పదవుల కోసం, స్వార్ధం కోసం నా తల్లిని చంపేశారు. అన్నదమ్ములని వేరు చేసేశారు, మరిన్ని కక్షలకి, కార్పణ్యాలకి దారి తీశారు. దీనికి సమాధానం ఏ రాజకీయ పార్టీ చెబుతుంది. ఏ మేధావి ఈ భాధ్యత భుజాన వేసుకుంటాడు.
కానీ ఎంతో మంది త్యాగమూర్తులు ఫలితంగా, తెలుగు బాష మాట్లాడే వాళ్లందరూ ఒక రాష్ట్రం గా ఏర్పడ్డ తెలుగు జాతి, ఆంధ్రరాష్ట్రం ముక్కలైపోయింది. స్వార్ధ రాజకీయాల కోసం బలైపోయింది. చాలా మంది మేధావుల తెలివితేటలు, రాజకీయ చాకచక్యం , చాతుర్యాల మధ్య నలిగి సమిధై పోయింది.
అన్నదమ్ములు కొట్టుకుంటుంటే వద్దని వారించాల్సిన పెద్దన్న లాంటి కేంద్ర ప్రభుత్వం, జనం ఏమయిపోయినా పరవాలేదు అనే విధంగా ఒంటేద్దుపోకడ నిర్ణయం తీసుకుని, తన నిర్ణయాన్ని సమర్ధించడానికి ఒక కమిటీని నియమించుకుంటే, వాళ్ళు తమ రాజకీయ ప్రయోజనాల కోసం విడదీసేస్తే , ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏం బావుకుందామని ఆశించి ఈ పని చేసిందో, తెలుగు ప్రజలందరికీ ఈ పాటికే అర్ధమయ్యుంటుంది.
కనీసం పొరుగు రాష్ట్రం వాడికి వున్న ఆత్మాభిమానం కూడా మన ప్రజలకి లేకపోవడం చింతించవలసిన విషయం.
ఏది ఏమైనా “ నన్ను చంపకండి” అని మొరపెట్టుకున్న తెలుగు తల్లి మొర ఏ ఒక్క బిడ్డా వినలేకపోయాడు.
కళ్ళున్నా గుడ్డి వాళ్ళు, చెవులున్నా చెవిటి వాళ్ళు, నోరు వున్నా మూగ వాళ్ళు, చేతిలో అధికారం వున్నా అసమర్ధులు, చేతకానివాళ్ళు అయిపోయారు. తెలుగు తల్లిని సమూలంగా నాశనం చేసేసారు...
రండి...ఏమీ చెయ్యలేక చేష్టలుడిగిన మేదావుల్లారా, మధ్యతరగతి ప్రజలారా...రండి.
మన ఆవేశాన్ని, చేతకాని తనాన్ని ఇలా ఎవరిమీదో రుద్దేద్దాం, ఎక్కడో రాసేద్దాం , ఈరోజు తెల్లారితే చాలు అనుకుందాం. మన రాష్ట్రం ముక్కలైనా, రావణకాష్టమైనా పట్టించుకోకుండా మన జీతం, మన జీవితం అనుకుంటూ పొరుగు రాష్ట్రానికో, పొరుగు దేశానికో పారిపోయి బతికేద్దాం.  ఈ దేశం బాగు పడదు అని లెక్చర్లు దంచేద్దాం.
ఎక్కడున్నా మళ్ళీ ఎలక్షన్లకి ఏ బస్సో, రైలో ఎక్కి మన ఊరికి పోయి మన ప్రజానేతలని, మన దశ,దిశానిర్దేశం చేసే ఈ స్వార్ధ రాజకీయ నాయకులకి ఓటు వేసి గెలిపిద్దాం.
జై బోలో భారత మాతాకీ, ..జై...

కేంద్ర ప్రభుత్వానికీ జై, అధిష్టానానికి జై....జయహో ...

Black day



ఎక్కడో దూరంగా టపాసులు పేలుతూ వుంటే , చప్పట్లు కొట్టాలా, ఇంట్లోకి వెళ్ళాలా అని తెలియని సందిగ్దం...
ఎక్కడో  జేజే లు వినపడుతూ వుంటే, ఏం చెయ్యాలో , ఏం చెప్పాలో తెలియని నిర్వేదం.
కన్నా తల్లి ఏడుస్తుంటే చూసి ఏమీ చెయ్యలేని నిస్సహాయాతని తలుచుకుని....రంపపు కోతలాంటి బాధ...అకారణమైన కోపం...
టీ.వి , వెబ్ సైట్స్ చూస్తుంటే, ఇది కలా? నిజమా అనే అయోమయం..
కలే కావాలని కోరిక...
నిజం ఎందుకు కాకూడదు అనే పిచ్చి ఎదురు ప్రశ్న...ఎందుకంటే నిజం ఎప్పుడూ నిష్టూరంగానే వుంటుంది.
ఈ విజయం నా వాళ్ళది కాదా..? ఇన్నాళ్ళు మాతో వున్న వాళ్ళది కాదా...అనిపించింది.
కిటికీలోంచి తొంగి చూస్తుంటే హోరున గాలీ,వర్షం....ఎవరో బావురుమని ఏడుస్తున్నట్టు...
ఆ వర్షాన్ని చూస్తే ..తెలుగుతల్లి కన్నీళ్ళ లా అనిపిస్తోంది...
మార్పు భౌగోళికం, అనివార్యం, పైగా ఎవరి జీవితంలోనూ ఎటువంటి మార్పునీ అకస్మాత్తుగా తీసుకురాదని తెలిసినా
ఏదో బాధ, ఆవేశం,...  ఎందుకో నాకు కూడా తెలియడం లేదు.

కాసేపాగి చూసుకుంటే నా చెక్కిళ్ళ మీద కూడా కన్నీళ్ళే వున్నాయి....

Andhrapradesh bifurcated

ఒకరికి మోదం, ఒకరికి నిర్వేదం...!
ఒకరికి అంబరాన్నంటే సంబరాలు, ఒకరికి పాతాళంలోకి జారిపోయిన నిరాశ, నిస్పృహలు...!
జిందాబాద్ లు ఒకచోట, ముర్దాబాద్ లు మరొకచోట....!
రేపటినుంచి కొత్త సూరీడు కొందరికి, రేపటినుంచి ఎలాగారా భగవంతుడా అని మరికొందరు..!
గెలిచామనుకుంటన్నారు కొందరు....ఓడిపోయాం అనుకుంటున్నారు మరి కొందరు...!
అందరూ అధిష్టానం చేతిలో పావులే....మరో గాంధీ గారి ప్రధానమంత్రిత్వానికి ఈ విభజనలన్నీ తోవలే...!
కొంతమంది ప్రజల అభీష్టాన్ని నెరవేర్చిన ఘనత ఒక పక్క....
చాలా మంది ప్రజల దృష్టిలో రాష్ట్రాన్ని ముక్కలు చేసిన అప్రతిష్ట ఒక పక్క....
చిన్న నవ్వు కూడా గుండెల్లో గునపాలు దింపుతుంది ఇప్పుడు...
ఒక్క మాట కూడా వేల వెక్కిరింతల పెట్టు అవుతుంది....
ఒక్క చిన్న సంఘటన కూడా అవుతుంది పెను ప్రమాదానికి ఆస్కారం,
మన సోదరులని అభినందించడం మన మరిచిపోకూడని సంస్కారం.
“తెలంగాణా ప్రాంత ప్రజలందరికీ శుభాకాంక్షలు..”