Tuesday, December 23, 2014

Paying homage to film director K balachander

బాలచందర్ అంతులేని కధ:
బాలచందర్ గారికి అనారోగ్యం అని వార్త చదివినప్పటి నుంచి మనసు ఏదో కీడు శంకించింది. ఆయనకి ఏమి కాకూడదు అనే బలమైన కోరిక, ఏదైనా అవుతుందో ఏమో అని తెలియని భయం....మళ్ళీ కొద్దిరోజుల తరువాత ఆయనకి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసి కొంత సంతోషం....ఇవన్నీ ఇంకొన్ని రోజుల్లో ఆవిరైపోబోతున్నాయి అని ఊహించని అనుభవం ఈరోజు జరిగింది.
ఆయన ఇక మన మధ్య లేరు అనే వార్త చాలా భాదించింది.
రజనీకాంత్, కమల హాసన్ లాంటి గొప్ప నటులను సూపర్ స్టార్స్ ని పరిచయం చేసిన ఘనత ఆయనదే.
అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం ,అలాంటి వారిని ఈ సంవత్సరం లో కోల్పోవడం మన దురదృష్టం.

గొప్ప వ్యక్తులైన అక్కినేని , బాపు, మరెంతో మంది లెజెండ్స్ ని ఈ 2014 సంవత్సరం మన నుంచి దూరం చేసి , చివర్లో బాలచందర్ గారిని కూడా తనలో కలిపేసుకుని చలనచిత్ర పరిశ్రమకి తీర్చలేని లోటు కలిగించింది.

బాలచందర్ గారి గురించి మాట్లాడే స్థాయి గాని, అనుభవం గాని లేని నేను, ఆయన గురించి ఇవాళ రాయడానికి కారణం ఆయన ఈరోజు మన ప్రపంచం నుంచి నిష్క్రమించడమే ...!
మొట్టమొదటి సారి నాకు బాలచందర్ గారిని పరిచయం చేసిన సినిమా “అంతు లేని కధ”.
కేబుల్ టి.వి. వచ్చిన కొత్తల్లో ఈటివి లో ఈ సినిమా చూశాను. అప్పుడు నేను సిక్స్త్ క్లాస్.
హీరోయిజం సినిమాలు మాత్రమే చూసి పెరిగిన నాకు, మొదటి సారి ఆ సినిమా పెద్ద షాక్.
జయప్రద లాంటి హీరోయిన్ ని పెట్టి, ఆయన తీసిన లేడీ ఓరియెంటడ్ సినిమా అది.  చివరి సీన్ వరకు ఏం జరుగుతుందా అని టెన్షన్ తో చూసిన సినిమా అది. క్లైమాక్స్ లో కూడా ఆమెకి పెళ్ళి అవ్వకుండా ఇంకా అలా మిగిలిపోవడం తో నిరాశ కలిగింది, అయినా ఆ కధ ని అర్ధం చేసుకునే వయసు అప్పుడు నాకు లేదు. తరువాత మరిన్ని సార్లు ఆ సినిమా చూసి అతను ఎంత అడ్వాన్స్డ్ గా ఆలోచించే వారో అర్ధం చేసుకున్నా.
దాని తరువాత కమల హసన్ నటించిన “ మరో చరిత్ర” చూశాను.  అప్పుడు ఆయన గొప్ప దర్శకుడు అని తెలిసింది.
దాని తరువాత ఒక్కొక్కటిగా ఆయన సినిమాలు చూస్తూనే ఉన్నాను. “ఇది కధ కాదు”, “ ఆకలి రాజ్యం”, “రుద్రవీణ” ఇలా వరస పెట్టి ఆయన సినిమాలు అన్నీ చూశాను. తమిళ్ లో విడుదలై తెలుగు లోకి డబ్బింగ్ కాని సినిమాలు కూడా చూశాను.

గొల్లపూడి శ్రీనివాస్ గారి స్మారక మెమోరియల్ అవార్డు ని “తారే జమీన్ పర్” సినిమాకు గాను అమీర్ ఖాన్ కి అందించడానికి వచ్చిన బాలచందర్ గారిని చెన్నై కామరాజ్ మెమోరియల్ హాల్ లో మొదటిసారి చూశాను.
అమీర్ఖాన్ ని పొగుడుతూ మాట్లాడుతూ “ ఐ యాం ఏ స్మాల్ ఫిలిం డైరెక్టర్ ఫ్రం సౌత్ ఇండియా” అనగానే , అమీర్ఖాన్ లేచి పరిగెత్తుకుని వచ్చి కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టడం , కన్నీళ్లు పెట్టుకొని “మీ సినిమాలు చూస్తూ పెరిగాను సర్” అనడం కళ్లారా చూశాను. ఎన్నో గొప్ప సినిమాలు తీసినా గొప్పలకి పోని నిగర్వి.

“ విన్నైతాండి వరువాయ “ సినిమా (తెలుగులో ఏ మాయ చేసావే)  తీసిన గౌతం మీనన్ కి ఒక లెటర్ రాసి ఈరోజు నుంచి నా “మరోచరిత్ర” సినిమాని తీసేసి అతి గొప్ప లవ్ స్టోరీస్ లో ఈ సినిమా ని పెడతారు అని చెప్పడం ఆయనలో గొప్పతనానికి మరో కోణం ..   

కధని చెప్పడం లో ఒక విశిష్టత , ఒక గొప్ప శైలి. అందరు రచయితలు కంటే ముందుగానే సమాజం లో జరగబోయే మార్పులని పసిగట్టి, పదేళ్ళ ముందుగానే సినిమాలు తీసి కొన్ని విమర్శలకి కూడా గురయ్యారు.
కాంట్రవర్సియల్ సినిమాలు ఎన్నో తీసి ప్రేక్షకుల తో ఒప్పించారు.అవన్నీ ఈరోజు క్లాసిక్ సినిమాలు.
తరువాత బుల్లి తెర మీద కూడా “ రహస్యం”, “ గుప్పెడు మనసు”, “ మర్మ దేశం” లాంటి మంచి సీరియల్స్ ని అందించారు. ఆయన గొప్ప దర్శకుడే కాదు....దార్శనికుడు కూడా. ఎంతో మంది ఫిలిం మేకర్స్ ని ఇన్ స్పయిర్ వ్యక్తి.
“ఇది కధ కాదు” ..... ఆయన చలన చిత్ర విజయాలే “ మరో చరిత్ర”.....ఆయన సినిమాలతో భారతీయ చలన చిత్రపరిశ్రమది ఒక “అంతులేని కధ..”
“ఆకలి రాజ్యపు “ సమాజం లో అసమానతల మీద ఎన్నో గొప్ప చిత్రాలను సృష్టించడానికి ఆయన శ్రుతి చేసిన “రుద్రవీణ “ ఆయన జీవితం

ఈరోజు మీరు మా మధ్య లేక పోయినా, మీ సినిమాలు మరిన్ని తరాలకు స్పూర్తినిస్తాయి సర్,


బాలచందర్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని మనస్పూర్తిగా ప్రార్ధిస్తూ.. 

Friday, December 19, 2014

God must be crazy

God must be crazy:

There is a guy in a city who is contractor and earned money in all unethical ways and goes to a temple for pilgrimage to donate some money to god for his grace on him...but he lost all his money at temple premises and it is stolen by a thief who lost his wealth because of few bad people in the society / gods grace, After all struggles he became a thief to feed his family.
now ,contractor is very sad and disappointed with the god for the money whatever he is lost at the holy place and for a moment, he felt if god exists, he will punish the real culprit behind this theft and do the justice which never happened.
on contrary,the thief is really happy and thankful to god for giving him the money to feed his family and felt god exists & donated some amount of his earnings to god from whatever is stolen and became a devotee. everyday He prays god before doing any theft.
so its an irony, contractor is a real thief in his life. thief is a path maker to his family.
Finally, god punished the devotee to become a thief and helped a thief to become a devotee and made them to realize the other aspect of life.
Did the god try to tell anything to this people or does he have any other work than teaching stupid people.?

Monday, November 24, 2014

ఏది దేవుడు..? ఏది బండ..?

Many of us does not know that Actor Ranganath is a good poet . I watched one of his interviews in youtube and really impressed with his work…He mentioned one of his poems in it.

I am bringing it to you….Hope all of you like it.


ఏది దేవుడు...?   ఏది బండ?

అదేదో ఊరి నుంచి మహా శిల్పి వచ్చాడు.
మరేదో ఊరి నుంచి పెద్ద బండ తెచ్చాడు.
ఆరడుగులు కొలత పెట్టి బండను ఖండించాడు
మిగిలిన మూడడుగుల ముక్కను పక్కకు తోసేశాడు.
ఆరడుగుల బండేమో విగ్రహమై వెలసింది.
మూడడుగుల ముక్క బండ చాకి రేవు చేరింది.
కంపు కంపు మనసులన్నీ దేవుని ఎదుట నిలిచాయి
కంపు గొట్టే బట్టలన్నీ బండచుట్టూ చేరాయి.
గొంతెమ్మ కోర్కెల గొంతులన్నీ తీర్ధంతో తడిశాయి.
మురికి మరకల బట్టలన్నీ నీటిలోన మునిగాయి.
అర్ధంకాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రద్ధలు....
చాకలి నోటి వెంట ఇస్సు ఇస్సు శబ్దాలు...
షటగోపం పవిత్రంగా ప్రతి తలనూ తాకుతోంది..
పవిత్రతకై ప్రతి బట్టా బండను తాకుతోంది.
కడగు గుడినుండి మనసులన్నీ కంపుతోనే వెళ్ళాయి..

రేవునుండి బట్టలన్నీ ఇంపుగా వెళ్ళాయి.....

ఏది దేవుడు..? ఏది బండ..?

Saturday, November 22, 2014

Books i read in 2014

  1.  i will add the description and better books in the below soon as i have few morein my queue to read. will share my opinions on it.
  2.      రాంపండు లీలలు ఎమ్బీఎస్ ప్రసాద్
  3.      చంగల్వ పూదండ యండమూరి
  4.      మోటార్ సైకిల్ డైరీస్ చె గువేరా
  5.      మీనా యద్దనపూడి సులోచనా రాణి
  6.      థి ఎండ్ మల్లాది   
  7.      బహుమతి --- యద్దనపూడి సులోచనా రాణి
  8.      sydney sheldon--naked face
  9.      పొగబోతు భార్య  -- ఎమ్బీఎస్ ప్రసాద్
  10.      షాడో షాడో మధు బాబు
  11.  డాక్టర్ శ్రీకర్ -- మధు బాబు
  12.  లేడీస్ హాస్టల్ ---యండమూరి
  13.  chicken soup series
  14.  బహుళ పంచమి జ్యోత్స్న గొల్లపూడి మారుతీరావు
  15.  చివరికి మిగిలేది---బుచ్చిబాబు
  16.  జీవన తరంగాలుయద్దనపూడి
  17.  కొవ్వలి నవలలు
  18.  పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
  19.  ఎర్రసీత గొల్లపూడి
  20.  Innovation secrets of steve jobs
  21.  Who moved my cheese
  22.  వడ్ల గింజలు శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి
  23.  స్వర బేతాళం యండమూరి
  24.  shock treatment--James hadley chase
  25.  కాదంబరిరావూరి భరద్వాజ
  26.  లోయనుంచి శిఖరానికి
  27.  love story--erich segul
  28.  ఆగమనం యద్దనపూడి
  29.  రా.వి.శాస్త్రి కధలు
  30.  tell me your dreams--shidney sheldon
  31.  if tomorrow comes
  32.  ప్రార్ధన యండమూరి
  33.  రా.వి.శాస్త్రి కధలు
  34.  కలుపు మొక్కలు శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి
  35.  tough times never last but tough people do
   36. alpajeevi

   37. Eesap kadhalu

   38. enthentha dooram by malladi venkata krishanmoorthy

  39. mandaakini by  malladi venkata krishanmoorthy

  40.

Sunday, September 7, 2014

Trivikram views on Bapu garu


An article in sakshi . Views of trivikram on bapu garu. A must read


ఆకాశం కారుస్తున్న కన్నీటితో భాగ్యనగరం అప్పటికే తడిసి ముద్దవుతోంది. అల్పపీడన ప్రభావమే కాదు, ఉరుము లేని పిడుగులా ఆదివారం సాయంత్రం అంతకు కొద్ది సేపటి క్రితమే హఠాత్తుగా మీద పడ్డ బాపు అస్తమయ వార్తతో తెలుగు జాతి విషాదంలో మునిగిపోయింది. బాపు - రమణలకు ఆత్మీయుడూ, వారి చివరి మజిలీలో సన్నిహిత సహయాత్రికుడూ అయిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు గుండెలు పిండే బాధ గొంతుకు అడ్డం పడుతోంది. మబ్బులు కమ్మేసిన ఆ సుదీర్ఘ... కాళరాత్రి... త్రివిక్రమ్ తన గుండె గది తలుపులు తెరిచారు. జాతి రత్నాన్ని పోగొట్టుకున్న తీరని బాధలోనూ ఓపిక కూడదీసుకొని, మాట రాని మౌనాన్ని అతి కష్టం మీద ఛేదించారు. కనీసం కలసి ఫోటో తీయించుకోవాలన్న ఆలోచనైనా రానందుకు చింతిస్తూనే, బాపు-రమణల మీద తన భక్తిని మనసు జ్ఞాపకాల చిత్రాలలో నుంచి వెలికి తీశారు. ముగిసిన ఓ శకానికి త్రివిక్రమ్ అర్పించిన  అక్షర నివాళి... సాక్షిపాఠకులకు ప్రత్యేకం...


ఏదైనా అనుకొంటే, వెంటనే చేసేయాలి. అంతేతప్ప ఆలస్యం అస్సలు కూడదు. ఇవాళ కాలం నేర్పిన కొత్త పాఠం ఇది. బాపు గారికి అనారోగ్యంగా ఉందని తెలిసినప్పటి నుంచి స్వయంగా వెళ్ళి కలవాలని అనుకుంటూ వచ్చా. తీరా వెళ్ళి కలవక ముందే ఆయన కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం ఈ దుర్వార్త తెలియగానే, ఒక్కసారిగా డీలా పడిపోయా. బాపు లాంటి గొప్పవ్యక్తి ఇక లేరు అనగానే నాకు ఏడుపొచ్చేసింది. (గొంతు జీరబోగా...) ఆరు నెలలుగా బాపు గారు ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కీమోథెరపీ చేయించుకుంటున్నారు. దాంతో బలహీనపడ్డారు. ఇవాళ ఆయన మరణంతో తెలుగు చలనచిత్ర, చిత్రకళా రంగాలకు సంబంధించి ఒక శకం ముగిసింది. పుట్టిన ప్రతి ఒక్కరికీ మరణం సహజమని తెలిసినప్పటికీ బాపు - రమణల లాంటి వ్యక్తులు వంద ఏళ్ళు కాదు... నూట పాతికేళ్ళు బతకాలనీ, ఆ చేతి వేళ్ళు ఇంకా రాయాలనీ, మరిన్ని బొమ్మలు గీయాలనీ మన లాంటి అభిమానులం కోరుకుంటాం. ఎందుకంటే, వాళ్ళు మనకిచ్చిన తీపి జ్ఞాపకాలు అలాంటివి.

వాళ్ళున్నది మా ఇంటి పైనే!

బాపు - రమణలతో నా తొలి పరిచయం వాళ్ళ రాధాగోపాళంచిత్రం కన్నా చాలా ముందు నుంచే! అప్పటికి నేను దర్శకుడిగా అతడుచిత్ర సన్నాహాల్లో ఉన్నాను. వాళ్ళు శ్రీభాగవతంసీరియల్ తీస్తున్నారు. రాధాగోపాళంటైమ్‌లో వాళ్ళకు సన్నిహితుడినయ్యా. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో హైదరాబాద్‌లో మా అపార్ట్‌మెంట్స్‌లోనే నాలుగో అంతస్తులో అద్దె ఇంట్లో బాపు - రమణలు ఉన్నారు. వాళ్ళ షూటింగయ్యాక సాయంత్రాల్లో వారానికి రెండుసార్లయినా కబుర్లాడుకొనేవాళ్ళం. వాళ్ళు ఏదైనా చెబుతుంటే, చెవి ఒగ్గి వినేవాణ్ణి. అలా ఎన్నో సంగతులు తెలుసుకున్నా, నేర్చుకున్నా. అందరూ రమణ గారు బాగా మాట్లాడతారు, బాపు గారు పెద్దగా మాట్లాడరని అంటారు. కానీ, నా విషయంలో అది నిజం కాదు. విచిత్రంగా బాపు గారు, నేను ఎక్కువ మాట్లాడుకొనేవాళ్ళం. ఇప్పుడాలోచిస్తే, అలా కుదరడం చిత్రమనిపిస్తుంటుంది.

బాపు క్లోజప్పులపై ఆ ప్రభావం!

నాకూ, ఆయనకూ ఉమ్మడి చర్చనీయాంశం - సినిమా. అలా కూర్చొని ఎన్నేసి గంటలు మాట్లాడుకొనేవాళ్ళమో! ఎక్కువగా అంతర్జాతీయ సినిమా గురించే మా సంభాషణ సాగేది. సినిమాల్లో, సంగీతంలో ఆయన అభిరుచి లోతైనది. ప్రాథమికంగా యూరోపియన్ సినిమా, ఇరానియన్ సినిమా బాగా ఇష్టం. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ది వెస్ట్’, ‘ఫర్ ఎ ఫ్యూ డాలర్స్ మోర్లాంటి చిత్రాలు తీసిన సెర్జియో లియోన్ ఆయనకు బాగా ఇష్టమైన దర్శకుడు. క్లోజప్ షాట్లు, బోల్డ్ క్లోజప్‌ల విషయంలో అతని ప్రభావం తన మీద ఉందేమో అనేవారు. కానీ, నన్నడిగితే ఆ దర్శకుడు ఎక్కువగా యాక్షన్‌లో అలాంటివి చేశారు. బాపు గారు ప్రాథమికంగా రొమాన్స్ సన్నివేశాల్లో ఆ పద్ధతి వాడారు. అదీ చాలా కళాత్మకంగా ఉంటుంది.

మూకీ చిత్ర యుగానికి చెందిన అమెరికన్ నటుడు జార్జ్ కూపర్ సినిమాలంటే ఆయనకు తెగ ఇష్టం. అలాగే, పాశ్చాత్య సంగీతజ్ఞుడు ఎనియో మొరికోన్ చేసిన నేపథ్య సంగీతం గురించి, ఆయన చేసిన ఆల్బమ్స్ గురించి ఎప్పుడూ చెబుతుండేవారు. అవి వినండి. ఆ సంగీతంలో మీకు ఎన్నో కథలు దొరుకుతాయిఅనేవారు. ఎందరో ఫిల్మ్ మేకర్లు, సంగీత దర్శకులు, సినిమాటోగ్రాఫర్ల పేర్లు ఆయన నోట్లో నానుతుండేవి. డెరైక్షన్‌కు సంబంధించిన రచనలు, గొప్ప సినిమాల స్క్రీన్‌ప్లేలు - ఇలా బాపు గారు నాకు చాలా పుస్తకాలిచ్చారు. చిన్న చిన్న కాగితాల మీద నోట్స్ లాంటి ఉత్తరాలు రాసేవారు. పచ్చళ్ళు పంపేవారు.

అటు ఆయన... ఇటు మేము... ఏడ్చేశాం!

శ్రీరామరాజ్యంచిత్రం విడుదల తరువాత అంత గొప్ప చిత్రం చూసి, ఉండబట్టలేక రాత్రి 12 గంటల వేళ ఫోన్ చేశాను. నిర్మాత సాయిబాబు గారు తీసి, బాపు గారికి ఫోన్ అందించారు. సినిమాలో ఏవేం బాగా నచ్చాయో చెబుతూ, నేను, నా శ్రీమతి ఇటుపక్క ఫోన్‌లో నిజంగా ఏడ్చేశాం. అటుపక్కన బాపు గారూ ఫోన్‌లోనే ఏడ్చేశారు. నాదేమీ లేదు. అంతా ఆ రాముడు, ఆ వెంకట్రావ్ (ముళ్ళపూడి వెంకట రమణ గారి అసలు పేరు. ఆయనను వెంకట్రావ్ అనే బాపు పిలిచేవారు)ల దయఅని పదే పదే తలుచుకున్నారు. రమణతో ఆయన స్నేహం అది. ఆయనకున్న గొప్ప సంస్కారం అది. నా గొంతు పూడుకుపోయింది. మాట రాలేదు. అది నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. శ్రీరామరాజ్యంతప్పకుండా చూడమని హీరో పవన్ కల్యాణ్‌కు చెప్పాను. ఒకరోజు రాత్రి 11 నుంచి ఒకటిన్నర దాకా ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేక ప్రదర్శన చూశారు కల్యాణ్. చూసి, చలించిపోయి, నాతో అరగంట మాట్లాడారు. ఆ వెంటనే రాత్రి 2 గంటలకు ప్రెస్ కెమేరాల ముందుకొచ్చి తన అనుభూతిని పంచుకున్నారు.  

ఆయనది అంతర్జాతీయ స్థాయి

దర్శకుడిగా తొలి సినిమాగా సాక్షిలాంటి ఆఫ్-బీట్ సినిమాను ఎవరైనా తీస్తారా? ఆ రోజు నుంచి చివరి దాకా బాపు - రమణలు వెండితెరపై చేసిన సాహసాలు అన్నీ ఇన్నీ కావు. ఏయన్నార్ ఉచ్చస్థితిలో ఉండగా ఆయన పాత్రకు హీరోయిన్ లేకుండా, భార్య పోయి, బిడ్డ ఉన్న పూజారి పాత్రను బుద్ధిమంతుడులో చేయించడం మరో సాహసం. ఆ చిత్రంలో గొప్ప ఫిలాసఫీ ఉంది. చివరలో భిన్నమైన ఆలోచనాధోరణులున్న హీరో పాత్రలు రెండూ నెగ్గినట్లు కన్విన్సింగ్‌గా చెప్పడానికి  ధైర్యం కావాలి. సినిమాలన్నీ సాదాసీదాగా, ఒకే పద్ధతిలో లీనియర్‌గా ఉండే రోజుల్లో, అలా అనేక కోణాలున్న సినిమాను, పైకి కనిపించేదే కాకుండా, లోలోపల ఎన్నో భావాలు పొదిగిన సినిమాలు చేయడం కష్టం. ఆ సాహసం ఆయన చేశారు. అలాగే, పూర్తి కామెడీ సినిమాలు లేని ఆ రోజుల్లోనే బంగారు పిచికతీశారు. ఆయన సాహసించిన నలభై ఏళ్ళ తరువాత ఇప్పుడు ఆ ట్రెండ్ చిత్రాలు జోరందుకున్నాయి.

ముత్యాల ముగ్గుచూస్తే, అప్పటి దాకా వచ్చిన తెలుగు చిత్రాలకు పూర్తి భిన్నంగా, ఆఫ్-బీట్‌గా నేపథ్య సంగీతం ఉంటుంది. భార్యాభర్తలిద్దరి దాంపత్య ఘట్టాన్ని కేవలం మాండలిన్ బిట్‌తో నడిపితే, వారిద్దరూ విడిపోయే సీన్‌ను రీరికార్డింగ్ లేకుండా చేశారు. బాపు షాట్ కంపోజిషన్, మేకింగ్, విజువలైజేషన్, నేపథ్య సంగీతం - అన్నీ అంతర్జాతీయ స్థాయివే. నా దృష్టిలో ఆయన తెలుగు గడ్డకే పరిమితమైపోయిన అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ మేకర్. అంతర్జాతీయ సినిమాలు చూసిన వ్యక్తిగా ఇది  ఘంటాపథంగా చెబుతున్నా. ఒక్క మాటలో రేపటి సినిమాను... నిన్ననే ఆలోచించి... ఇవాళే తీసేసిన... దిగ్దర్శకుడు బాపు గారు. కాలాని కన్నా ముందస్తు ఆలోచనలున్న క్రియేటర్.

ఇప్పటికీ నాకు ఎప్పుడు మనసు బాగా లేకపోయినా, బాపుగారి బుద్ధిమంతుడు’, ‘అందాల రాముడుచూస్తా. తక్షణమే పాజిటివ్ ఎనర్జీనిచ్చే చిత్రాలవి. ఇక, ‘మన ఊరి పాండవులులో బాలూ మహేంద్ర, బాపుల విజువల్ జీనియస్ చూడవచ్చు. అభిరుచి గల మంచి సినిమాకూ, కమర్షియల్ హిట్టయ్యే సినిమాకూ మధ్య బంధం వేసి, ఆ రెంటినీ కలగలిపిన అద్భుతమైన వ్యక్తులు బాపు-రమణ. వాళ్ళకు తెలిసిందల్లా హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తూ పోవడమే. హిట్టయితే ఆ డబ్బులు సినిమాలోనే పెట్టారు. ఫ్లాపైతే, ఆ అప్పులు తీర్చడానికి మరో సినిమా తీశారు. వాళ్ళు సంపాదించిన దాని కన్నా పోగొట్టుకున్నదే ఎక్కువ. చిరస్మరణీయమైన సినిమాలు మిగిల్చారు. చేస్తున్న పనిని ఆస్వాదిస్తూ, దానినే దైవంగా చేసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది.

ఆయనలా పని చేస్తేనా...

నన్నడిగితే బాపు చాలా గొప్ప థింకర్ కూడా! ఆయన భావవ్యక్తీకరణలో, గీసిన బొమ్మలో, తీసిన సినిమాలో అది స్పష్టంగా తెలుస్తుంటుంది. ఆయన తన శక్తిని మాటలతో వృథా చేసేవారు కాదు. చేస్తున్న పనిలోనే దాన్ని క్రమబద్ధీకరించి, వినియోగించేవారు. అలాగే, ఒక వ్యక్తిగా, కళాకారుడిగా బాపు గారు ఎంతో క్రమశిక్షణ ఉన్న వ్యక్తి. ఆయన చేసినంత కఠోర పరిశ్రమ ఎవరూ చేయలేరు. లేకపోతే, పుస్తకాల ముఖచిత్రాలు, కార్టూన్లు, కథలకు బొమ్మలు, క్యారికేచర్లు - ఇలా ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఏకంగా ఒకటిన్నర లక్షల పైగా బొమ్మలు వేయడం సాధ్యమా చెప్పండి. ఇంకా యాడ్ ఏజెన్సీల్లో క్రియేటివ్ హెడ్‌గా వేసినవి, స్క్రిప్టు స్టోరీబోర్డుకు వేసుకున్న బొమ్మల లాంటివి లెక్కలోకి తీసుకోకుండానే అన్ని బొమ్మలయ్యాయంటే ఆశ్చర్యం. బొమ్మలేయడాన్ని పనిగా అనుకోలేదు. ఎవరో రాసిన నవలకు ముఖచిత్రం వేయడం కూడా ఆ వంకతో తాను ఆ కథ చదవవచ్చనే! అది చదివి, దాని మీద తన అభిప్రాయాన్నీ, సమీక్షనూ మాటలతో కాదు, బొమ్మతో చెప్పేసేవారు. అది ఆయన గొప్పతనం.

బాపు గారు అసలు సిసలు కళాకారుడు. ఎంతో జీనియస్. లుంగీ కట్టుకొని, లాల్చీ వేసుకొని, ప్యాడ్, కుంచెలు పెట్టుకొని, కింద కూర్చొని, ఎదురుగా డీవీడీ ప్లేయర్‌లో సినిమా పెట్టుకొనో, పక్కనే సంగీతం వింటూనో బొమ్మలు వేసుకొనేవారు. చేయి నొప్పి పుడితే, కాసేపు ఆపి, సినిమా చూసేవారు. సినిమా బోర్ కొడితే, అది పాజ్ చేసి, బొమ్మలు వేసుకొనేవారు. ఇలా రోజూ 16 గంటలకు పైగా పనిచేయడం, పడుకోవడం! మళ్ళీ పొద్దున్నే లేవగానే అదే పని! ఎవరికో ఏదో నిరూపించడానికి కాక, మనస్ఫూర్తిగా పనిని అంతగా ఆస్వాదిస్తూ, ఆనందంగా చేస్తే శ్రమే తెలియదు. ఆయనలో కనీసం పది శాతమైనా మనం పని చేస్తే చాలు... ఎంచుకున్న రంగంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతాం.

పక్కా తెలుగువాడు

జీవితమంతా మద్రాసులో గడిపిన బాపుగారు పక్కా తెలుగువాడు. ఆయన కట్టుబొట్టు, ఆహారవ్యవహారాలు, ఇష్ట పడే రుచులు, మాట్లాడే మాట, రాసే రాత, గీసే గీత - అన్నీ తెలుగు వాతావరణానికి ప్రతిబింబాలే. ప్రపంచం మొత్తం తిరిగినా, పల్లెటూరు తెలుగువాడు ఎలా ఉంటాడో అలాగే, సింపుల్‌గా బతికారు. స్టీలు గ్లాసులో కాఫీ తాగడం నుంచి కింద కూర్చొని పని చేసుకోవడం దాకా - తాను ఏ వాతావరణం నుంచి వచ్చాడో ఆ వాతావరణాన్ని వదిలిపెట్టలేదు. అదే ఆయన సృజనలో ప్రతిఫలించింది. ఒక్క ముక్కలో - ఆయన నేల మీదే నిల్చొని, గాలిపటం ఎగరేశారు. దాన్ని ప్రపంచం మొత్తం చూపించారు. అదీ ఆయన ప్రత్యేకత.

అరుదైన వ్యక్తులు, వ్యక్తిత్వాలు

వ్యక్తులుగా కూడా వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు. అలాంటి వ్యక్తులు సినీ రంగంలో అరుదు. ఎదుటివారి వల్ల వాళ్ళు మోసపోయారే తప్ప, వాళ్ళు ఎవరినీ మోసం చేయలేదు. ప్రతిభతో పాటు అరుదైన వ్యక్తిత్వం వారి సొంతం. ఆ రెండింటి సమ్మేళనం కాబట్టే, జయాపజయాలను పట్టించుకోకుండా, నమ్మిన విలువలకే జీవితాంతం కట్టుబడగలిగారు. చివరి వరకు ఆ స్థాయిని కొనసాగించారు. ఇవాళ సినీ, సాహిత్య, కళా రంగాలతో పాటు సామాన్య తెలుగు సమాజంలోనూ వారికి ఇంత గౌరవ ప్రతిష్ఠలు దక్కడానికి కారణం అదే! స్నేహమంటే బాపు - రమణలంటారు. ఒక రంగంలో సృజనాత్మకంగా అత్యున్నత శిఖరాలకు వెళ్ళిన ఇద్దరు మనుషులు 66 ఏళ్ళ పైగా ఏ గొడవా లేకుండా కలిసి బతికారు, కలిసి నడిచారు, కలసికట్టుగా తమ రంగంలో కృషి చేశారని చెబితే చాలు... ఇక వాళ్ళ స్నేహం గురించి మనం ప్రత్యేకించి ఏమీ చెప్పనక్కర లేదు. ఒకసారి నేను ఉండబట్టలేక, ‘మీరిద్దరి మధ్య ఎప్పుడూ అభిప్రాయ భేదాలు రాలేదాఅని అడిగేశా. ఎందుకు రావు! కథా చర్చల్లోనో, మరొకచోటో ఏదో అభిప్రాయ భేదం వస్తుంది. వాదించుకుంటాం. మళ్ళీ మామూలైపోతాంఅన్నారు. వాళ్ళెప్పుడూ తమ జీవితాన్ని సంక్లిష్టం చేసుకోలేదు. సాదాసీదాగా గడిపేశారు. వాళ్ళలా సింపుల్‌గా బతకడం మనకేమో కాంప్లికేటెడ్ అయిపోతోంది!

అలా బతకడం అంత సులభం కాదు!

బాపు - రమణల స్నేహం, సాన్నిహిత్యం ఎంతంటే, రమణ గారు పోయాక బతకడం ఇష్టలేక బాపుగారు వెళ్ళిపోయారని నాకు అనిపిస్తోంది. బాపు గారు గుర్తొచ్చినప్పుడల్లా ఆయనలా హార్డ్‌వర్క్ చేయాలని స్ఫూర్తి కలుగుతుంటుంది. ఇక, రమణ గారి పేరు చెప్పగానే ఆయనంత గొప్పగా రాయాలనుకుంటా. ఎవరెస్ట్ అంటే ఎవరైనా ఎక్కాలనే అనుకుంటారు కదా! నేనూ అంతే! వాళ్ళు ఎప్పుడూ మాట్లాడలేదు, ఉపన్యాసాలివ్వలేదు. నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళలాగా భేషజం లేకుండా మామూలు వాళ్ళలా బతకడం అంత సులభం కాదు. అయినా సరే, అలా ఉండేందుకు ప్రయత్నించడం, వాళ్ళ సినిమాలు చూసి ఆనందించడమే మనమిచ్చే ఘనమైన నివాళి. అంత గొప్పవాళ్ళ జీవితంలోని చివరి రోజుల్లో కొన్ని క్షణాలైనా వారితో కలసి గడపడం నా జీవితకాలపు అదృష్టం. ఆ అదృష్టం మరింత కాలం కొనసాగకుండా, అంతలోనే ఆ మహానుభావులు భౌతికంగా దూరమైనందుకు ఇవాళ ఆగకుండా ఏడుపొచ్చేస్తోంది. ఇంతకాలం జాతి మొత్తాన్నీ నవ్వించిన బాపు గారూ! రమణ గారూ! మీకిది న్యాయమా సార్?

- సంభాషణ: రెంటాల జయదేవ

బాపు మార్కు సెటైర్లు

ఆహార విహారాల్లో కూడా బాపు -రమణలది మంచి అభిరుచి. ఏదైనా మితంగా, హితంగా ఉండేది. బాపు గారు చాలా తక్కువ తినేవారు. కాకపోతే, వాటిల్లోకి పప్పు, కూర, పచ్చడి అన్నీ ఉండాలి. అంత చక్కటి రాయల్ టేస్ట్. బాపు గారిలో హాస్యప్రియత్వానికి ఎన్నో ఉదాహరణలు.  నటుడు బ్రహ్మానందం గారి బలవంతంతో వాళ్ళింటికి బాపు గారు ఒకసారి భోజనానికి వెళ్ళారు. ఆయనకు స్వయంగా వడ్డించాలని బ్రహ్మానందం గారి కోరిక. బాపు గారు సరేనన్నారు. ఆయన తింటుంటే, ‘ఇంకొంచెం తినండిఅంటూ మరింత వడ్డించబోయారు బ్రహ్మానందం. బాగుందని చెప్పాలంటే, ఇంకొంచెం తినాలాండీ!అని బాపు వ్యాఖ్యానించారు. ఒకటే నవ్వు. కొత్తల్లో ఒకసారి నేను అతడుకథ చెబుతుంటే, రెండు మూడు సీన్లు విన్నాక ఆయన, ‘శ్రీనివాస్ గారూ! షాట్లు చెప్పకండి. కథ చెప్పండిఅన్నారు. నా బలహీనతను క్షమించి, భరించండిఅని నేను సిగ్గుపడుతూ అన్నాను. ఇలా మా మధ్య చతురోక్తులు చాలా నడిచేవి.

అది ప్రభుత్వం ఆయన మీద వేసిన అతి పెద్ద కార్టూన్!

బతికుండగా ఎవరినీ గౌరవించాల్సినంతగా గౌరవించకపోవడమనేది ప్రాథమికంగా మన తెలుగువాళ్ళకున్న దౌర్భాగ్యం. ఇప్పటికి మూడున్నర దశాబ్దాల క్రితమే సీతా కల్యాణంలో గంగావతరణ ఘట్టం కోసం ఒకే నెగటివ్ మీద ఏకంగా 27 ఎక్స్‌పోజర్లు చేసిన తెలివైన టెక్నీషియన్ బాపు. చుక్క నీళ్ళు లేకుండా కేవలం చాక్‌పీస్ పొడితో, గంగానది ఉత్తుంగ తరంగంలా కిందకు దూకుతున్న అనుభూతి తెరపై కల్పించిన జీనియస్. తెలుగు భాషకు తన రాతతో ఒక ప్రత్యేకమైన ఫాంట్ అందించారు. ఆడపిల్ల అంటే, బాపు బొమ్మలా అందంగా ఉండాలన్న నిర్వచనానికి కారణమయ్యారు. ఇవాళ ప్రీ-విజ్అని అందరూ చెబుతున్న స్టోరీ బోర్డ్ కాన్సెప్ట్‌ను ఉత్తరాదిన సత్యజిత్ రే, దక్షిణాదిన బాపు ఏనాడో చేశారు. పిల్లల కోసం బాపు-రమణలు ఉచితంగా వీడియో పాఠాలు తీసి ఇచ్చారు. పత్రికల్లో, ప్రకటన రంగంలో, పుస్తక ప్రచురణ రంగంలో, సినిమాల్లో - ఇలా అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేశారు. ఇక, వ్యక్తిగతంగానూ ఎంతోమందికి ఆదర్శమయ్యారు. అలాంటి వాళ్ళను కూడా ప్రభుత్వం గుర్తించకపోతే, ఇంకేం చేస్తే గుర్తిస్తారో? భారతీయ సినిమాకూ, ప్రపంచ సినిమాకూ, తెలుగు చిత్రకళా రంగానికీ ఇంత సేవ చేసిన వారికి కనీసం పద్మవిభూషణ్అన్నా ఇవ్వాలి కదా! కానీ, ఇన్నేళ్ళ తరువాత, రమణ గారు కూడా గతించాక, గత ఏడాది బాపు గారికి ఉత్తి పద్మశ్రీఇచ్చారు. నా దృష్టిలో బాపు గారిపై ప్రభుత్వం వాళ్ళు చేసిన అతి పెద్ద కార్టూన్ అది!
 


రామ్ గోపాల్ వర్మకు తిక్క: ఒక పరిశీలన

An article From sakshi...For your reference again...!

రామ్ గోపాల్ వర్మకు తిక్క: ఒక పరిశీలన



రామ్ గోపాల్ వర్మకు తిక్క: ఒక పరిశీలనరామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ పరిచయం అక్కరలేని సంచలన సినిమా దర్శకుడు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తలకెక్కుతుంటారు. అటు సినిమా గురించి గానీ, ఇతర అంశాల గురించి గానీ ఏదో ఒక వ్యాఖ్య చేసి వివాదాలు సృష్టిస్తుంటారు.రాజకీయ నాయకుల గురించి, అదీ చాలా వింతగా  మాట్లాడతారు. మత విశ్వాసాలపై మాట్లాడి వారి మనోభావాలు నొప్పిస్తారు.కొన్ని కొన్ని సందర్భాలలో అందరిలో ఆలోచనలు రేకెత్తిస్తారు.  వివాదాలు లేకపోతే అతనికి నిద్రపట్టదేమో. తన సినిమా టైటిల్ ద్వారానే రాము సంచలనం సృష్టిస్తారు. తన ప్రచారం ద్వారా ఆ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి రేకెత్తిస్తారు. సినిమా చూసేందుకు థియేటర్ కు రప్పిస్తారు. విరుద్ధ భావాలతో విశిష్ట లక్షణాలు ఉన్న వ్యక్తి రాము. అతనికి జీవితంలో  రెండే ముఖ్యమైన విషయాలు. ఒకటి సినిమా, రెండు మగువ.సినిమాకు సంబంధించి కీర్తి శిఖరం అందుకున్నారు. మగువకు సంబంధించి కూడా సుఖ శిఖరం అందుకొనే ఉంటారు. మగువేగా మగవాడికి మధుర భావన అనేది అందరికీ తెలిసిందే. రాము కూడా అంతే. తను చేసే పనిలోనే(సినిమా - మగువ) ఆనందాన్ని పొందుతాడు. అవే అతని ప్రపంచం.  చీకు - చింతా - దిగులు - నిరుత్సాహం...వంటివి రాము దరికి రావు. అయితే రాము కూడా బాధపడతారు - ఏడుస్తారు - నవ్వుతారు - నవ్విస్తారు. తన సినిమాల ద్వారా నరకం కూడా చూపిస్తారు. తన ప్రపంచం సినిమా. అతని ఆలోచనలు సినిమా. అతని శ్వాస సినిమా. వృత్తి పరంగా అతనికి సినిమా తప్ప మరొకటిలేదు. అవసరంలేదు. మరో ఆలోచన చేయరు. యాడ్ ఫిల్మ్ తీయమని అడిగినా, ఎందుకు సినిమా తీస్తానని చెబుతారు.  రాము ఓ వ్యాపారికి కూడా వ్యాపారం నేర్పగలరు. యాడ్ సంస్థకు కూడా మతులుపోగొట్టే కొత్తకొత్త  ఆలోచనలు ఇస్తారు.  తన లక్ష్యసాధనలో ఎంతటి మేధావినైనా బురిడీకొట్టించగలరు. స్థిత ప్రజ్ఞుడు.

రాముకి తిక్క ఉందా? తనకి తిక్క ఉందని ఆయన చెప్పుకుంటారు. అదివేరే విషయం. అతనికి తిక్క ఉంటే అతనిని నమ్మి నిర్మాతలు కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేస్తారు?  సినీ నటులు, ఇతర సాంకేతిక నిపుణులు అతనితో కలసి ఎలా పనిచేస్తారు? టాలీవుడ్ లోనే కాకుండా, బాలీవుడ్ లో కూడా అగ్రాసనానికి ఎలా చేరుకోగలిగారు? అయినా ఆయన లక్షణాలు ఒకసారి పరిశీలిద్దాం.

ఎవరు ఎన్ని అనుకున్నా భారతీయ సినిమా చరిత్రలో అతనితో పోల్చగల దర్శకులు లేరు. అటు బాలీవుడ్ లో గానీ, ఇటు టాలీవుడ్ లోగాని మనం గొప్ప దర్శకులుగా భావించే వారికి ఉండే ప్రతిభా సామర్థ్యాలతోపాటు ఇతనికి చాలా అదనపు అర్హతలు, తెలివితేటలు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నాయి. కథ- కథనం -  సంగీతం- చిత్రీకరణలో కొత్తదనం - ఆధునిక సాంకేతికతను ఆసాంతం వాడుకునే సమర్ధత ఉన్నాయి. కొత్త కొత్త ఆలోచనలు - కొత్తపోకడలు - ఎటువంటి ఆలోచనలకైనా చిత్ర రూపం ఇవ్వగల సత్తా, సామర్ధ్యం ఉంది. మన దర్శకులలో ఒక్కొక్కరు ఒక్కో అంశంలో ప్రతిభావంతులుగా చెప్పుకుంటాం. కథల ఎంపిక- కథనం- సంగీతం- అపురూపమైన కొత్త అందాల(హీరోయిన్లు)ను తెరకు పరిచయం చేయడం- హీరోయిన్ లో ఉంటే అందాన్ని వివిధ భంగిమలలో అద్భుతంగా చూపించడం...ఇటువంటి అంశాలలో ఒక్కొక్కరికి ఒక్కోదాంట్లో ప్రావీణ్యత ఉంటుంది. రామ్ గోపాల్ వర్మలో వీటన్నిటితోపాటు ఫొటోగ్రఫీ, ఇతర సాంకేతిక పరిజ్ఞానంలో కూడా అవగాహన, అనుభవం ఉంది. ప్రతి సినిమాలో రాము ముద్ర ఉంటుంది. కొత్తకొత్త కథలతో, కొత్త ఆలోచనలతో చిత్రాలు తీస్తున్నారు. వీటికి తోడు ఏ దర్శకునికీ లేనంత ప్రచార సామర్ధ్యం రాముకి ఉంది.అది అతని ప్రత్యేకత. గతంలో ఏ దర్శకుడూ ప్రచారానికి సంబంధించి ఇంతటి ప్రావీణ్యాన్ని ప్రదర్శించలేదు.

 సినిమాలు సమాజాన్ని మార్చవనేది అతని ఖఛ్చితమైన అభిప్రాయం. అందుకే సామాజిక ప్రయోజనం కోసం తాను సినిమాలు తీయను అని చెబుతారు. అతనితో కొద్ది సేపు మాట్లాడిన తరువాత చాలా మందికి తాము తెలుసుకోవలసింది చాలా ఉన్నదన్న విషయం తెలుస్తుంది. లేకపోతే అటువంటి అభిప్రాయానికి వస్తారు. జడత్వం గల మనిషిలోనైనా ఆలోచనలు పుట్టించగల ఘటికుడు. ప్రతిమనిషిలో విభిన్న కోణాలు ఉన్నట్లే రాములో కూడా ఉన్నాయి.  అతని పేరే రామ్ గోపాల్. అక్కడే రెండు ధృక్పదాలు - అలాగే అతని ఆలోచనా విధానం - నడవడి - ప్రవర్తన - వ్యవహర శైలి - మాటల తీరు....భిన్నంగానే ఉంటాయి. అయితే అతనేంటో అతనికి తెలుసు. అతనికి ఏం కావాలో తెలుసు. ఏం చేస్తున్నాడో తెలుసు. ఏం చేయాలో తెలుసు. జీవితం పట్ల స్పష్టత ఉంది.సినిమా నిర్మాణం పట్ల సంపూర్ణ అంకిత భావం ఉంది.  ప్రతి విషయంలో అతనికి ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. అవి ఎదుటి వారికి నచ్చవచ్చు. నచ్చకపోవచ్చు. అది వేరే విషయం.  అతనికీ చదువు, సభ్యత, సంస్కారం ఉన్నాయి. మంచీచెడు తెలుసు. అందరిలాగానే భావోద్వేగాలు ఉన్నాయి. తల్లిదండ్రులను ప్రేమిస్తారు. గౌరవిస్తారు. అభిమానిస్తారు. వారికి అండగా ఉంటారు. అతనికీ స్నేహితులు ఉన్నారు. ప్రియురాలు కూడా ఉండేది. చదువుకునే వయసులో ప్రేమలో  పడ్డారు. పుట్టి పెరిగిన ఊళ్లంటే అభిమానం. దేశం పట్ల గౌరవం ఉంది.  అతనికి మంచి చేసిన వారిని, సహాయం చేసిన వారిని జీవితాంతం గుర్తుంచుకుంటారు. అతనూ సహాయం చేస్తారు.

రాముకి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంది.  అతని ఆలోచనలు, సాధించిన విజయాలే అతనిలోని విశ్వాసాన్ని పెంచుతున్నాయి. అతనికి ధైర్యం కూడా ఎక్కువే. కష్టపడే స్వభావం. తనకు నచ్చిన పని(సినిమా)ని శ్రమ అనుకోరు. బద్ధకం - సొల్లుకబుర్లు అతనికి అసలు నచ్చవు. పనిలోనే సంతృప్తి, ఆనందం  పొందుతారు. ప్రపంచ సినిమా రంగాన్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు పోతుంటారు. అటువంటి ఆలోచనలతో తన వద్దకు వచ్చినవారిని కూడా స్వాగతిస్తారు. తను ఏవిధంగా అప్పటికి భిన్నమైన ఆలోచనతో సినిమా రంగానికి వచ్చారో, ఆ విధంగా వచ్చిన ప్రతివారిని ప్రోత్సహిస్తారు. సహకరిస్తారు. సహాయపడతారు. అండగా నిలుస్తారు.  అతనికి ముసుగు(మాస్క్)లేదు. తన అభిప్రాయాలు - ఆలోచనలు బయటకు చెప్పడానికి జంకడు. ఏ విషయాన్నైనా ఎంతవరకైనా, ఎంత లోతుగానైనా ఆలోచించగలరు. ఆ ఆలోచనను బహిరంగంగా చెప్పగల ధైర్యం ఉన్నవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఓ ప్రపంచ పౌరుడు(ఇది చాలా విస్తృతార్ధం. ఓ మతానికో, ఓ సంస్కృతికో, ఓ కులానికో, ఓ కుటుంబానికో చెందినవాడు కాదు.  ప్రపంచంలో వివిధ సంస్కృతులు - వివిధ ఇజాలు-వివిధ ధృక్పదాలు ఉన్నాయి. ఈ విశాల విశ్వంలో అతనిదో ఇజం.) అతనిలో ఎన్ని ప్రత్యేకతలు, ఎన్ని వ్యతిరేక అంశాలు ఉన్నప్పటికీ భారతీయ సంస్కృతీ సంప్రదాయాల ప్రభావం అతనిపై ఉంటుంది.  అతను ముక్కు సూటిగా మాట్లడతారు. అలాగే వెళతారు.
అందరూ అనుకుంటున్నట్లుగా రాములో ఎన్ని వ్యతిరేక అంశాలు ఉన్నప్పటికీ అతనికి కోపం రావడం తక్కువ. పనిలో కూడా ఎవరినీ తిట్టరు. విసుక్కోరు. కోప్పడరు. ఏ పనైనా తనకు కావలసిన విధంగా వారు చేయకపోతే ఇక అంతే. ఏమీ అనకుండా వారిని వదిలేస్తారు. ఎవరినీ శత్రువులుగా భావించరు. ఒకరిని మోసం చేయాలన్న ఉద్దేశం అతనికి ఉండదు. ఒకరికి హాని తలపెట్టాన్న ఆలోచన కూడా రాదు. ఆయాచితంగా డబ్బు రావాలని కోరుకోరు. కష్టపడి సంపాదించాలనే స్వభావం అతనిది. ఎవరినీ కష్టపెట్టాలని గానీ, నష్టపరచాలని గానీ అనుకోరు.  అయితే తన పనులను చక్కబెట్టుకోవడానికి, తన లక్ష్యాలను చేరుకోవడానికి అబద్దాలు ఆడతారు. నాటకీయంగా వ్యవహరిస్తారు. లౌక్యంగా మాట్లాడతారు. అంతేగానీ తన లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం మరొకరిని మోసం చేసే స్వభావం మాత్రం అతనికిలేదు. స్వయం కృషి, టాలెంట్ తో ముందుకు పోవడమే అతనికి తెలుసు.

సాధారణంగా ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి లౌక్యం తెలియదు. రాముకు లౌక్యం బాగా తెలుసు. అదే అతని విజయానికి మూలం. రాముకి లౌక్యం ఏమిటని మీరు అనుకోవచ్చు. అతను ఈ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అతని దగ్గరకు నిర్మాతలు వస్తున్నారు. ప్రారంభంలో అతను ఎన్నో అబద్దాలు చెప్పి- నాటకీయంగా వ్యవహరించి - లౌక్యం ప్రదర్శించి విజయం సాధించారు. ఈ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు కూడా అతని దగ్గర లౌక్యంలేకపోతే ఇలా కొనసాగలేరు.

ప్రపంచంలో ఏ దర్శకుడికి ఆపాదించనన్ని లక్షణాలను భారతీయ ప్రేక్షకులు రామ్ గోపాల్ వర్మకు ఆపాదించారు. తిక్క- చపలచిత్తం - మూర్ఖుడు - అసాంఘీక శక్తి - మేథావి - క్రియేటివ్ డైరెక్టర్ - జీనియస్ - స్వేచ్ఛాజీవి -- తలతిక్క- పబ్లిసిటీ స్టంట్ -  అజ్ఞాని - స్త్రీలంటే గౌరవంలేదు - నైతిక విలువలు లేనివాడు - హింసాత్మక చిత్రాలు తీసేవాడు - అట్టర్ ఫ్లాప్ చిత్రాలు తీసి అటు నిర్మాతలను నష్టపరుస్తూ, పరమ చెత్త సినిమాలతో ఇటు ప్రేక్షకులను హింసిస్తున్నాడు -  మొండివాడు - పొగరుబోతు - తెలివితక్కువ వాడు - నాస్తికుడు-స్వార్ధపరుడు - ఉన్మాధి - అహంభావి - చంచల స్వభావుడు - నిజాయితీలేనివాడు - వింత మనిషి - తెలివైన మూర్ఖుడు - పబ్లిసిటీ పిచ్చోడు - చిత్రమైన వ్యక్తి -  సూపర్బ్ డైరెక్టర్ - దర్శక నక్షత్రం - సత్తా ఉన్నదర్శకుడు - వాస్తవాలకు చిత్ర రూపం ఇచ్చే అద్బుత దర్శకుడు - చిత్ర నిర్మాణంలో కొత్తపుంతలు తొక్కిన గొప్ప దర్శకుడు - రెటమతం - పెద్దల పట్ల గౌరవంలేదు - మంచీమర్యాద తెలియదు - సభ్యతలేదు - గర్వం - వెటకారం ఎక్కువ - సమాజం పట్ల బాధ్యతలేదు - భార్యను వదిలేశాడు - ప్రేమానుబంధాలు తెలియదు - సమాజాన్ని నాశనం చేసే చిత్రాలు నిర్మిస్తాడు- అన్నీ కాపీ సినిమాలే- అతని సినిమాలలో హింస, రౌడీయిజం, గూండాయిజం, మాఫియా, అండర్ వరల్డ్... ఇవే ఉంటాయి- దెయ్యాలు - భూతాలు - ప్రేక్షకులను భయపెట్టే చిత్రాలు తీస్తాడు - ఒకటి బంపర్ హిట్ కొడితే, నాలుగు ఫ్లాపులు - ఏది మాట్లాడినా పబ్లిసిటీ కోసమే - సినిమా వ్యాపారం కోసం తిక్కతిక్కగా మాట్లాడి ప్రేక్షకులను ఆకర్షించడం - చెత్త సినిమాలు తీసి జనమీద రుద్దడం - జీవితం పట్ల ఒక దృక్పదంలేదు.....ఇలా ఎవరికి తోచిన విధంగా వారు అనేక చిత్రవిచిత్రమైన లక్షణాలు అతనికి ఆపాదించారు.

అతనూ తక్కువేం కాదు అదే స్థాయిలో తిక్కతిక్కగా, అడ్డదిడ్డంగా, ఆలోచనలు రేకెత్తించే విధంగా, వీడెవడ్రా బాబూ అనుకునేట్లుగా, నేనింతే, నా ఇష్టం- నాకోసమే సినిమాలు తీసుకుంటా- నా ఇష్టం వచ్చినట్లు తీస్తా - నాకు తోచింది తీస్తా - చూడాలనుకున్నవారు చూస్తారు - వద్దనుకున్నవారు చూడరు.- నాకు ఏ సమయంలో ఏది అనిపిస్తే అది తీస్తా - క్లిక్ అయితే క్లిక్, ఫ్లాప్ అయితే ఫ్లాప్ - కాపీ కొడుతూనే ఉంటా- కాపీ కొట్టి ఇంజనీరింగ్ పాసయ్యా - అనేక సినిమాలు కాపీ కొట్టి హిట్లు సాధించా - నా చావు నేను చస్తాను - నా సినిమా చూడండి అని నేను చెప్పడంలేదు. ...ఇలా మాట్లాడుతుంటారు.  మీడియా వారు సదుద్దేశంలో అడిగిన ప్రశ్నలకు సరిగానే సమాధానం చెబుతారు. అతని చేత ఏదో చెప్పించడానికి ప్రయత్నిస్తే మాత్రం కావాలని తిక్కతిక్కగా, అడ్డదిడ్డంగా సమాధానాలు చెబుతాడు. తిక్క ప్రశ్నలకు తిక్క సమాధానాలు, మంచి ప్రశ్నలకు మంచి సమాధానాలు ఇస్తుంటారు. కావాలని పనిగట్టుకొని ఏ ఒక్కరిని  విమర్శించరు. పేరు పెట్టి ఒకరి గురించి మాట్లాడే సమయంలో ఒక స్థాయిని మించి విమర్శించరు. సందర్భం వచ్చినప్పుడు తన అభిప్రాయం దైర్యంగా చెబుతారు. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో దూకుడుగా మాట్లాడతారు. అవతలవారిని బాధపెడుతుంటారు. తనకు తన అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉందని మాత్రమే అనుకుంటారు. ఆ అభిప్రాయం అవతలివారి మనసు నొప్పించకూడదు అనే విషయం మరచిపోతారు. ఎదుటి వారి మనోభావాలను గౌరవించాలనే అంశం వదిలివేస్తారు. అటువంటి సందర్భాలలో వివాదం కొని తెచ్చుకుంటారు.

అతని ప్రపంచం సినిమా - తను అనుకున్న సినిమా తీస్తారు- మనసు పెట్టి పనిచేస్తారు. తన సినిమా సక్సెస్ కి పొంగిపోవడం - ఫ్లాప్ కు కుంగిపోవడం అనేది ఉండదు.  రెండిటికి ఒకే రకంగా పని చేస్తారు. ఒకే రకంగా ఆలోచన చేస్తారు.  సినిమా ఫ్లాప్ అయితే తను ఫెయిల్ అయినట్లుగా భావించరు. ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిదా అని ఆలోచన చేస్తారు. అదే అతని ప్రత్యేకత. ఎంత గొప్ప సినిమాలు తీశారో అంత చెత్త సినిమాలు కూడా తీశారు. అయితే ఏదైనా అతని సొంతం, అతని ఆలోచనల నుంచి పుట్టినదే.
రాము ఎవరి మాట వినరు. తన ఇష్టం వచ్చిన విధంగా సినిమాలు తీస్తారు. నచ్చిన విధంగా జీవిస్తారు.
అదే అతని స్టైల్.
వేరు వేరు రాములు
సినిమా ప్రపంచం రాము, మీడియా ముందు కనిపించే రాము, కుటుంబంలో రాము వేరువేరుగా ఉంటారు. సినిమా రంగంలో తనకు కావలసిన పనుల కోసం చాలా కలుపుగోలుగా వ్యవహరిస్తుంటారు. తనకు కావలసిన నటన, షాట్, సంగీతం, దృశ్యం... రాబట్టుకోవడం కోసం చాలా తెలివిగా, చనువుగా, నొప్పించకుండా సూచనలు ఇస్తుంటారు.  మీడియాను వాడుకోవడంలో రాము దిట్ట. చిక్కడు-దొరకుడు పద్దతిలో సమాధానాలు చెబుతుంటారు. అతనిని ఇంటర్వ్యూ చేయడం కూడా కష్టమే. ఎటువంటి ప్రశ్నకైనా తెలివిగా సమాధానం చెబుతారు. ఒక్కోసారి తర్కాన్ని  కూడా చొప్పిస్తుంటారు. పబ్లిసిటీలో భాగం కానివ్వండి, అతని స్వభావం కానివ్వండి తన సినిమా కథను గానీ, సన్నివేశాలను గానీ, దృశ్యాల చిత్రీకరణను గానీ, సంగీతాన్ని కానీ  ఎవరి దగ్గర నుంచి,  ఎక్కడ నుంచి, ఎలా కాపీ కొట్టింది సవివరంగా, స్పష్టంగా చెబుతారు. కాపీ కొట్టడం, అనుసరించడం  తనకు కావలసిన విధంగా మలుచకున్నట్లు కూడా వివరిస్తారు. శంకరాభరణం ఒరిజినల్ - శివ కాపీ అని చెబుతారు. అదే అతని నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. తల్లిదండ్రలు అంటే అపారమైన గౌరవం, అభిమానం, ప్రేమ ఉన్నాయి.తమ్ముడు, చెల్లెలిపై  కూడా ప్రేమాభిమానాలు ఉన్నాయి.  కుటుంబంలో కూడా ఏదైనా నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తారు. తన మాట వినకపోతే వదిలివేస్తారు. తను చెప్పినది ఎదుటివాళ్లు వినాలనే స్వభావంకాదు.

పెళ్లి - విడాకులు

ఇది పూర్తిగా వ్యక్తిగతం. ప్రముఖ వ్యక్తి అయినందున ప్రస్తావించడం సహజం. మేథావులు, శాస్త్రవేత్తలు, మితిమీరిన తెలివితేటలు, విజ్ఞానం గలవారు, తమ వృత్తిలో అపర నైపుణ్య గలవారు వైవాహిక జీవితంలో విఫలమవుతుంటారు. ఇటువంటి వారిలో ఎక్కువ మంది భార్యలను పట్టించుకోకపోవడం వల్ల వారికి భర్తపై విరక్తి కలగడమో,  వైవాహిక జీవితంపై విరక్తి కలగడమో లేక అసలు జీవితంపైనే విరక్తికలగడమో జరుగుతుంటుంది. దాంపత్య జీవితం పదికాలాలపాటు సుఖవంతంగా కొనసాగాలంటే పరస్పర అవగాహన - ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించడం - ఒకరినొకరు అర్ధం చేసుకోవడం(ఒకరినొకరు భరించడం అని కూడా అంటారు) ముఖ్యం. తనను భరించినప్పటికీ, తను భరించడానికి సిద్దంగా ఉండి ఉండకపోవచ్చు.  వేధించడం, హింసించడం, అసంతృప్తితో జీవించడం కంటే పరస్పర అంగీకారంతో విడిపోవడం ఉత్తమం. రాము అదే చేశారు.

రాము ప్రత్యేకతలు:
* రాము తన జీవితంలో అత్యంత ఇష్టపడే  వ్యక్తి  తండ్రి కృష్ణంరాజు. తండ్రి అంటే భయం లేదు. అభిమానం, అత్యంత గౌరవం.
*  అతనిని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తులు  బ్రూస్లీ, అయాన్ ర్యాండ్, నీషే, మిత్రుడు సత్యేంద్ర
* శ్రీదేవి అంటే అతనికి అత్యంత ఇష్టం. ఆరాధనా భావం.
* అతనికి ఈర్ష్యాద్వేషాలు లేవు.
* రాముని ఎవరైనా శత్రువులుగా భావించవచ్చునేమోగానీ, రాము ఎవరినీ శత్రువుగా భావించరు.
* తనకు నచ్చని వారిని దూరంగా ఉంచుతారు లేకపోతే ఆయనే  దూరంగా ఉంటారు.
* ఎదుటి మనిషిలో టాలెంట్ ని గుర్తించడంలో  ఘటికుడు.. ప్రోత్సహించడంలో కూడా ముందుంటారు.
* సినిమాకు సంబంధించిన 24 రంగాలలో వందల మంది కొత్తవారిని పరిచయం చేశారు. ప్రోత్సహించారు.  * తనకు అసిస్టెంట్లుగా పనిచేసివారికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించి మరీ సినిమాలు నిర్మించారు.
* సినిమా ప్రమోహన్ కు నటీనటులు ఎవరూ అవసరంలేదు. అతనొక్కడే చాలు
* తనకు మాట్లాడే స్వేచ్ఛ ఉందని, ఎదుటివారిని హర్ట్ చేస్తుంటారు.
* పబ్లిసిటీ టెక్నిక్ లో భాగంగా రెటమతంగా మాట్లాడతారు. వాస్తవాలనే కాస్త పొగరుగా చెబుతారు. టాలెంట్ ఉన్నవారికి పొగరు ఉండటం సహజం. కొత్త ఆలోచనలు రేకెత్తించేవిధంగా చర్చిస్తుంటారు
* విపరీతంగా పుస్తకాలు చదువుతారు. అయితే ఎవరినీ గుడ్డిగా అనుసరించరు.
* ప్రతి విషయంలోనూ అతనికి ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. జీవితం పట్ల స్పష్టత ఉంది. అతను అతనులానే ప్రవర్తిస్తారు.
* అతనికి అవార్డులపై ఆసక్తిలేదు.
* డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వరు.అంటే కనీస అవసరాలకు సరిపోను ఉంటే చాలనుకుంటారు.
* నైతిక విలువలు పాటిస్తారు.
* సినిమాను తన ఇష్టం వచ్చినట్లే తీస్తారు. కమర్షియల్ గా ఆలోచించరు. ఆ సినిమా హిట్ అనేది ఆ నిర్మాత అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. తను మాత్రం అన్ని చిత్రాలు మనసుపెట్టే తీస్తారు.
రామ్ గోపాల్ వర్మపై పిహెచ్ డిలు చేసే అవకాశం
భవిష్యత్ లో రామ్ గోపాల్ వర్మపై దేశంలో యూనివర్సిటీ లేక యూనివర్సీటీలలో పిహెచ్ డిలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సినిమా - జర్నలిజం - సైకాలజీ - యాడ్స్ - కామర్స్ - హిస్టరీ...వంటి డిపార్ట్ మెంట్లలో పిహెచ్ డి చేయడానికి వీలుంది. సినిమా విభాగంలో అయితే 'సినిమా మేకింగ్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ, జర్నలిజంలో అయితే 'మీడియాను వాడుకోవడంలో వర్మ దిట్ట',  సైకాలజీలో అయితే 'వైరుధ్య భావాల రామ్ గోపాల్ వర్మ', యాడ్స్ లో అయితే 'సినిమా ప్రమోషన్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ' కామర్స్ లో అయితే 'సినిమా బిజినెస్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ'  హిస్టరీలో అయితే 'హిస్టరీ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ'....ఇలా వర్మకు సంబంధించి అనేక అంశాలపై పరిశోధనలు చేయవచ్చు.
ఇదంతా చదివిన తరువాత కూడా రామ్ గోపాల్ వర్మకు తిక్క ఉందని అనుకుంటున్నారా?