బాలచందర్ అంతులేని కధ:
బాలచందర్ గారికి అనారోగ్యం
అని వార్త చదివినప్పటి నుంచి మనసు ఏదో కీడు శంకించింది. ఆయనకి ఏమి కాకూడదు అనే
బలమైన కోరిక, ఏదైనా అవుతుందో ఏమో అని తెలియని భయం....మళ్ళీ కొద్దిరోజుల తరువాత
ఆయనకి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసి కొంత సంతోషం....ఇవన్నీ ఇంకొన్ని రోజుల్లో
ఆవిరైపోబోతున్నాయి అని ఊహించని అనుభవం ఈరోజు జరిగింది.
ఆయన ఇక మన మధ్య లేరు అనే
వార్త చాలా భాదించింది.
రజనీకాంత్, కమల హాసన్ లాంటి
గొప్ప నటులను సూపర్ స్టార్స్ ని పరిచయం చేసిన ఘనత ఆయనదే.
అటువంటి గొప్ప వ్యక్తి
ఈరోజు మన మధ్య లేకపోవడం ,అలాంటి వారిని ఈ సంవత్సరం లో కోల్పోవడం మన దురదృష్టం.
గొప్ప వ్యక్తులైన అక్కినేని
, బాపు, మరెంతో మంది లెజెండ్స్ ని ఈ 2014 సంవత్సరం మన నుంచి దూరం చేసి , చివర్లో బాలచందర్
గారిని కూడా తనలో కలిపేసుకుని చలనచిత్ర పరిశ్రమకి తీర్చలేని లోటు కలిగించింది.
బాలచందర్ గారి గురించి
మాట్లాడే స్థాయి గాని, అనుభవం గాని లేని నేను, ఆయన గురించి ఇవాళ రాయడానికి కారణం
ఆయన ఈరోజు మన ప్రపంచం నుంచి నిష్క్రమించడమే ...!
మొట్టమొదటి సారి నాకు
బాలచందర్ గారిని పరిచయం చేసిన సినిమా “అంతు లేని కధ”.
కేబుల్ టి.వి. వచ్చిన
కొత్తల్లో ఈటివి లో ఈ సినిమా చూశాను. అప్పుడు నేను సిక్స్త్ క్లాస్.
హీరోయిజం సినిమాలు మాత్రమే
చూసి పెరిగిన నాకు, మొదటి సారి ఆ సినిమా పెద్ద షాక్.
జయప్రద లాంటి హీరోయిన్ ని పెట్టి,
ఆయన తీసిన లేడీ ఓరియెంటడ్ సినిమా అది. చివరి
సీన్ వరకు ఏం జరుగుతుందా అని టెన్షన్ తో చూసిన సినిమా అది. క్లైమాక్స్ లో కూడా
ఆమెకి పెళ్ళి అవ్వకుండా ఇంకా అలా మిగిలిపోవడం తో నిరాశ కలిగింది, అయినా ఆ కధ ని
అర్ధం చేసుకునే వయసు అప్పుడు నాకు లేదు. తరువాత మరిన్ని సార్లు ఆ సినిమా చూసి అతను
ఎంత అడ్వాన్స్డ్ గా ఆలోచించే వారో అర్ధం చేసుకున్నా.
దాని తరువాత కమల హసన్
నటించిన “ మరో చరిత్ర” చూశాను. అప్పుడు
ఆయన గొప్ప దర్శకుడు అని తెలిసింది.
దాని తరువాత ఒక్కొక్కటిగా
ఆయన సినిమాలు చూస్తూనే ఉన్నాను. “ఇది కధ కాదు”, “ ఆకలి రాజ్యం”, “రుద్రవీణ” ఇలా
వరస పెట్టి ఆయన సినిమాలు అన్నీ చూశాను. తమిళ్ లో విడుదలై తెలుగు లోకి డబ్బింగ్
కాని సినిమాలు కూడా చూశాను.
గొల్లపూడి శ్రీనివాస్ గారి
స్మారక మెమోరియల్ అవార్డు ని “తారే జమీన్ పర్” సినిమాకు గాను అమీర్ ఖాన్ కి
అందించడానికి వచ్చిన బాలచందర్ గారిని చెన్నై కామరాజ్ మెమోరియల్ హాల్ లో మొదటిసారి
చూశాను.
అమీర్ఖాన్ ని పొగుడుతూ
మాట్లాడుతూ “ ఐ యాం ఏ స్మాల్ ఫిలిం డైరెక్టర్ ఫ్రం సౌత్ ఇండియా” అనగానే ,
అమీర్ఖాన్ లేచి పరిగెత్తుకుని వచ్చి కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టడం , కన్నీళ్లు
పెట్టుకొని “మీ సినిమాలు చూస్తూ పెరిగాను సర్” అనడం కళ్లారా చూశాను. ఎన్నో గొప్ప
సినిమాలు తీసినా గొప్పలకి పోని నిగర్వి.
“ విన్నైతాండి వరువాయ “
సినిమా (తెలుగులో ఏ మాయ చేసావే) తీసిన
గౌతం మీనన్ కి ఒక లెటర్ రాసి ఈరోజు నుంచి నా “మరోచరిత్ర” సినిమాని తీసేసి అతి
గొప్ప లవ్ స్టోరీస్ లో ఈ సినిమా ని పెడతారు అని చెప్పడం ఆయనలో గొప్పతనానికి మరో
కోణం ..
కధని చెప్పడం లో ఒక
విశిష్టత , ఒక గొప్ప శైలి. అందరు రచయితలు కంటే ముందుగానే సమాజం లో జరగబోయే
మార్పులని పసిగట్టి, పదేళ్ళ ముందుగానే సినిమాలు తీసి కొన్ని విమర్శలకి కూడా
గురయ్యారు.
కాంట్రవర్సియల్ సినిమాలు
ఎన్నో తీసి ప్రేక్షకుల తో ఒప్పించారు.అవన్నీ ఈరోజు క్లాసిక్ సినిమాలు.
తరువాత బుల్లి తెర మీద కూడా
“ రహస్యం”, “ గుప్పెడు మనసు”, “ మర్మ దేశం” లాంటి మంచి సీరియల్స్ ని అందించారు. ఆయన
గొప్ప దర్శకుడే కాదు....దార్శనికుడు కూడా. ఎంతో మంది ఫిలిం మేకర్స్ ని ఇన్ స్పయిర్
వ్యక్తి.
“ఇది కధ కాదు” ..... ఆయన
చలన చిత్ర విజయాలే “ మరో చరిత్ర”.....ఆయన సినిమాలతో భారతీయ చలన చిత్రపరిశ్రమది ఒక “అంతులేని
కధ..”
“ఆకలి రాజ్యపు “ సమాజం లో
అసమానతల మీద ఎన్నో గొప్ప చిత్రాలను సృష్టించడానికి ఆయన శ్రుతి చేసిన “రుద్రవీణ “ ఆయన జీవితం
ఈరోజు మీరు మా మధ్య లేక
పోయినా, మీ సినిమాలు మరిన్ని తరాలకు స్పూర్తినిస్తాయి సర్,
బాలచందర్ గారి ఆత్మకి శాంతి
చేకూరాలని ఆ దేవుడ్ని మనస్పూర్తిగా ప్రార్ధిస్తూ..