సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు:
ఈ దశాబ్దం లో వచ్చిన అతి పెద్ద మల్టీ స్టారర్ మూవీ. బాలీవుడ్ లో మాత్రమె మనం చూడగలుగుతున్న ఇటువంటి చిత్రాలు, తెలుగులో రావడం బాగా అరుదు. అలాంటి ప్రయత్నాన్ని చేసిన నటీనటులను, దర్శకుడిని, నిర్మాతను అభినందించి తీరాలి. ఇంటిల్లపాదీ కూర్చుని చూడదగిన చక్కని ఫ్యామిలీ పిక్చర్ ఇది.
అయితే ఇది విడుదలైన చాలా రోజుల తరువాత ఈ ఉపోద్గాతం ఎందుకు అని మీకు అనుమానం రావచ్చు. దానిని నివృత్తి చెయ్యాల్సిన బాధ్యత నా మీద వుంది. మనం చాలా సినిమాలు చూస్తాం, చూసి ఆనందిస్తాం. మళ్ళీ అదే ఆనందం కోసం అదే సినిమా మళ్ళీ మళ్ళీ చూస్తాం. అంటే లడ్డూ తిన్న పిల్లాడు , లడ్డూ తినడానికే అలవాటు పడినట్టన్నమాట. అందులో ఆనందమూ మారదు,మనమూ మారము.
కానీ కొన్ని సినిమాలు మాత్రం, మనం ఒకసారి చూసినప్పుడు ఒకలాగా అర్ధమవుతాయి. దానిని మళ్ళీ చూసినప్పుడు ఇంకోలా అర్ధమవుతాయి. అవి మాత్రమే చరిత్ర లో క్లాసిక్స్ గా నిలిచిపోతాయి. వాటిని రాయగల్గిన రచయితలు, తీసిన దర్శకులు మహానుభావులు అనిపిస్తారు మనకి. అలాంటి చిత్రాలు రావడం ఇప్పుడు అరుదైపోయింది అనుకోండి...!
ఈ మధ్య కాలం లో కొన్ని సినిమాలు చూసినప్పుడు అక్కడతోనే అవి మర్చిపోయేలా వున్నాయి. వాటి గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది అన్నట్టు. అవి హిట్ అయినా కూడా ఆ సినిమాలో మనం గ్రహించవలసినది ఏమీ వుండదు.
నిజానికి సినిమా మాధ్యమం అంటే కేవలం జన రంజకం మాత్రమే..కానీ అందులో కొన్ని మంచి విషయాలు నేర్పగలిగితే, కొంత జనాలకి చెప్పగలిగితే అని ఆలోచించగలిగే దర్శకులు వుంటే ఆ సినిమా మాధ్యమం యొక్క అవసరం, పరమార్ధం నెరవేరినట్టే. అలా చెప్పిన సినిమాలలో నాకు ఈ మధ్య కాలం లో నచ్చిన సినిమా “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”. అయితే అందరిలాగే మొదటిసారి చూసినప్పుడు పెద్ద మల్టీ స్టారర్ చిత్రం కాబట్టి ఎక్కువ అంచనాలతో వెళ్లాను. వాటికి సరితూగకపోయినా, కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. కారణం అందులో వున్న పాత్రలు, సన్నివేశాలు. ఏవీ కూడా కమర్షియల్ పంధా లో లేకుండా సాదాసీదాగా , నిజజీవితానికి దగ్గరగా నడిపించడం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అదే సినిమాని రెండో సారి లాప్ టాప్ లో చూస్తున్నప్పుడు , ఎటువంటి అంచనాలూ లేవు కాబట్టి, అదే సినిమా నాకు ఇంకోలా అర్ధమైంది. “అదేంటి ఇంతకు ముందు ఇలా చూడలేదే నేను..” అనుకున్నాను. అయితే అందరూ నాలాగా చూసీ వుండరు, లేదా మొదటిసారి నాలాగే చూడకుండాను వుండరు. కానీ నేను చూసి, అర్ధం చేసుకున్నదానిని మీతో పంచుకోవాలి అనుకుంటున్నా...అంతే..!
కధ విషయానికి వస్తే , ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ, వాళ్ళని రేలంగోల్లు అంటారు. ఆ ఇంటికి పెద్ద ప్రకాష్ రాజ్. అతని భార్య జయసుధ, తల్లి రోహిణీ హట్టంగడి వుంటారు. వీళ్ళతో పాటు సీత కూడా వుంటుంది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ అందరినీ పలకరిస్తూ వుండే ప్రకాష్ రాజ్ గారికి ఇంట్లో ఒక సమస్య వుంది. అది అతని ఇద్దరు కొడుకులూ సమయానికి అందిరాక, సరైన ఉద్యోగాలు దొరక్క నిరుద్యోగులుగా వుండటం.
అందులో పెద్దోడు , వెంకటేష్. బొత్తిగా లౌక్యం తెలియని మనిషి. కోపాన్ని అయినా, ఆనందాన్ని అయిన వెంటనే పైకి ప్రదర్శిస్తాడు. అలాగే వున్న ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు. ఇక చిన్నోడు మహేష్ బాబు. ఎలాంటి సమస్యకైనా లౌక్యంతో , కొంత వెటకారంతో, సమాధానం చెప్పగలడు. ఎదురుపడి “లవ్ చేస్తున్నా” అన్న అమ్మాయిని కూడా వెటకారంగా ఒక మాట అని తప్పించుకోగలడు.ఇలాంటి వీళ్ళ ఇంట్లో వీళ్ళకి ఒక చెల్లి కూడా వుంది.
అందరిలాగే వీళ్ళని ద్వేషించే విజయవాడ వాళ్ళు. రావు రమేష్ వాళ్ళ ఇంటికి పెద్ద. రేలంగి వాళ్ళంటే ఇతనికి కోపం. జెలసీ. ఎందుకంటే తమ్ముడిని ఎంత వద్దన్నా ,వాళ్ళింటి అమ్మాయిని చేసుకున్నాడు. చివరికి చిన్న యాక్సిడెంట్ లో అతను అతని భార్య చనిపోయి, వాళ్ళ కూతురు సీతని వదిలేశారు. కానీ సీత చిన్నప్పటి నుంచి రేలంగి మావయ్య దగ్గర పెరిగింది. పైగా ఆమెని పెద్దోడికి ఇచ్చి పెళ్ళి చేద్దాం అనుకోవడం కూడా. అదీ రావు రమేష్ కి నచ్చనిది..
విజయవాడ వాళ్ళ ఇంట్లో ఒక పెళ్ళికి రేలంగి వాళ్ళ ఇంట్లోంచి పెద్దోడు వెల్లనంటే, చిన్నోడిని పంపిస్తారు. అక్కడ వాళ్ళ అమ్మాయి(సమంత) ఇతన్ని ఇష్టపడుతుంది. ఆమె పెళ్ళి కూతురికి చెల్లి. పెళ్ళి కూతురు , అత్తగారితో కలిసి అన్నవరం వెళ్లి వస్తుంటే ట్రైన్ లో ,రేలంగి మావయ్య ఎదురుపడి వాళ్ళతో సరదాగా మాట్లాడుతాడు. అది చూసి పెళ్ళి కూతురి అత్తగారు, రేలంగి వారి అమ్మాయికి ఒక మంచి సంభందం చూస్తారు.ఆ సంభందం కుదుర్చుకుని పెళ్ళి చేస్తారు రేలంగి వాళ్ళు .పెళ్ళికి విజయవాడోళ్ళు కూడా వస్తారు.
వాళ్ళంటే పడని పెద్దోడు సరిగ్గా రావు రమేష్ దగ్గర మాట కాస్తాడు. దానితో అతనికి కోపం వచ్చి ఒక మాట అంటాడు.గొడవ జరుగుతుంది. చుట్టూ వున్న పెద్దలు ఏదో సర్ది చెబుతారు. ఇంతలో పెళ్ళి హడావుడిలో పెద్దోడి ని పిలవడానికి వచ్చిన చిన్నోడు అతన్ని చూసి పెళ్ళి చూడటానికి లోపలికి రమ్మని అడుగుతాడు. “అందరూ వెళ్లి కుదుర్చుకుని వచ్చారుగా సంభందం “ అంటాడు కోపంగా..దానికి చిర్రెత్తుకొచ్చిన చిన్నోడు మొక్కని తన్నేసి కోపంగా వెళ్ళిపోతాడు.
ఇక అక్కడినుంచి అన్నదమ్ములిద్దరి మధ్య చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వుంటుంది. దానిని సవరించుకోడానికి మహేష్ , వెంకటేష్ ని హైదరాబాద్ తీసుకెళ్తాడు. కానీ అక్కడ అనుకోని పరిస్థితులలో తిరిగి మహేష్ ని సమంత తో చూసిన వెంకటేష్ అలిగి ఇంటికొచ్చేస్తాడు. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది.
ఈలోగా ఒక వ్యక్తిని కాపాడబోయి ప్రకాష్ రాజ్ యాక్సిడెంట్ కి గురవుతాడు. అతని మంచితనం అందరికీ తెలుస్తుంది.అదే సమయంలో అందరూ భద్రాచలం వెళ్లడం, అక్కడ ఒక ప్రమాదం లో వీళ్ళందరూ సాటి మనుషులకి సాయ పడటం జరుగుతుంది. దానిలో వీళ్ళ పాత్ర చూసి పక్కనే వున్న రావు రమేష్ వీళ్ళ మంచితనం అర్ధం చేసుకుంటాడు. అన్నదమ్ముల మధ్య వున్న పొరపొచ్చాలు అన్నీ తండ్రి చెప్పిన మంచి మాటల వలన తీరిపోతాయి.
చివరికి పెద్దోడు సీతని పెళ్ళి చేసుకోవడంతో కధ సుఖాంతం అవుతుంది.
అనాలిసిస్:
1.ఈ కధ కొన్ని ఫ్యామిలీస్ మధ్య నున్న సున్నితమైన భావోద్వేగాలుగా కనిపిస్తుంది. అందులో ముఖ్య పాత్రలు చిన్నోడు,పెద్దోడు, తండ్రి ప్రకాష్ రాజ్. అంతర్లీనంగా వుండే పాత్ర సీతది.
2.నాకు అర్ధమైనంత వరకు, ఒకరితో ఒకరు సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోలేక ఇబ్బంది పడి సమస్యని పెంచుకున్న ఇద్దరు అన్నదమ్ముల కధ ఇది. ఒకరి మీద కోపాన్నైనా, ఇష్టాన్నైనా డైరెక్ట్ గా చెప్పలేం మనం. అందుకే దానికి వేరే దారి వెతుక్కుంటాం. సాధారణంగా అందరి ఇళ్లలోనూ కనిపించే వాతావరణమే ఇది.
3.మొదటి సీన్ లోనే కోట శ్రీనివాసరావు తో గొడవ పడేటప్పుడే పెద్దోడు లౌక్యం లేని, ముక్కు సూటి మనిషి అని అర్ధమవుతుంది. రెండో సీన్ లో చిన్నోడు బాగా లౌక్యం నేర్చుకున్నవాడు అని తెలుస్తుంది.వాళ్ళిద్దరి మధ్యా సంభాషణ కూడా అలాగే వుంటుంది పూర్తిగా ఒకరి అభిప్రాయలు ఒకరు వ్యక్తపరుచుకోలేకుండా.
4.విజయవాడోల్ల ఇంటి పెళ్ళికి పెద్దోడు వెళ్ళడు. చిన్నోడు వెళ్ళడం అతనికి నచ్చదు కానీ ఏమనడు. తీరా చెల్లికి పెళ్ళి సంభందం విజయవాడోల్ల నుంచి వచ్చిందని తెలిసి పెద్దోడు కోప్పడతాడు. ఆ విషయంలో చిన్నోడికి కోపం వస్తుంది. ఇంట్లో అమ్మకి చెప్పేసి హైదరాబాద్ తిరిగి బయలుదేరతాడు. కానీ అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర పెద్దోడి కోసం చూస్తూ వుంటాడు. కోపం వచ్చిందని పైకి చెప్పడు, అలాగని ఎదురు చూడకుండా వుండడు. చివరికి పెద్దోడు అక్కడికి వస్తాడు. ఆ క్షణంలో వాళ్ళ మధ్య ఈగో తొలగిపోతుంది.
5. తరువాత విజయవాడోల్ల సంభందమే ఫిక్స్ అయ్యి చెల్లి కి పెళ్ళి జరుగుతూ వుంటుంది. కొబ్బరితోటలో పెళ్ళి ఎరేంజ్ మెంట్స్ చూసి రావు రమేష్ జెలసీ ఫీలవుతాడు. అక్కడ పెద్దోడికి సీతనిచ్చి పెళ్ళి చేస్తారా అని అతనిని అడుగుతారు మిగతావారు. అనుకోని విధంగా, పెద్దోడికి ,రావు రమేష్ కి గొడవ జరుగుతుంది. “నా కూతురు చేసి వుండక పోతే ఈ సంభందం మీకు దొరికేది కాదు అని దెప్పుతాడు” రావు రమేష్. దానితో పెద్దోడికి కోపం వస్తుంది. నిజానికి రావు రమేష్ తో జరిగిన గొడవ చిన్నోడికి తెలీదు. పెళ్ళి ఇంట్లోకి రమ్మని పెద్దోడిని పిలవడానికి వస్తే , అది కాస్తా అతను మాట పట్టింపుగా తీసుకుని, చిన్నోడు విజయవాడొల్ల ఇంట్లో పెళ్ళికి వెళ్లడం వల్లే ఇదంతా జరిగింది అని మాట విసుర్తాడు. ఆ మాటకి హార్ట్ అయిన చిన్నోడు ఎలాగోలా కన్విన్స్ చెయ్యాలనుకుంటాడు.కుదరదు. మళ్ళీ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఇదంతా అప్పుడే వచ్చిన సీత చూస్తుంది. వీళ్ళ మధ్య జరిగింది ఆమెకి ఒక్కదానికే తెలుసు. అన్నదమ్ముల మధ్య ఏం జరుగుతోందో ఇట్టే గ్రహించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కోపం తట్టుకోలేక చిన్నోడు పూలకుండీ తన్నేసి వెళ్ళిపోతాడు.
నిజానికి ఇంట్లో అందరి గురించి ఇట్టే తెలుసుకునే మనిషి సీత. తన పాదం తాకిన భూమి కూడా కష్టపడ కూడదు అనుకుంటుంది. ఇంట్లో మామ్మ తో పూలు కోసేటప్పుడు మొక్కకి పూలు ఉండకూడదు అనుకుంటుంది. ఎందుకంటే “ఉండకూడదు అంటే ఉంటాయి” అనే ఫీలింగ్.
6.పెళ్ళి అయిపోయిన తరువాత ప్రకాష్ రాజ్ చిన్నోడిని పిలిచి అన్నదమ్ములు ఇద్దరినీ కలిసి మగ పెళ్ళి వారి ఆచారం ప్రకారం చిన్న తిరుపతి వెళ్లి రమ్మంటాడు. అది కాస్తా చిన్నోడిని ఇరకాటం లో పెడుతుంది. “ నన్ను పెద్దోడికి చెప్పమంటావా?” అని ఆయన అడిగితే వాళ్ళిద్దరి మధ్య జరిగినది తండ్రికి తెలిస్తే బాగోదు అని “వద్దు” అని చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోతాడు. పెద్దోడిని ఎలాగోలా కన్విన్స్ చేద్దాం అని అతన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. కానీ అక్కడ పెద్దోడి మూడ్ బాగోలేకపోవడం, ఇతను వచ్చినా అతను రెసిప్రొకేట్ అవ్వకపోవడం చూసి చిన్నోడు వెళ్ళిపోతాడు. నిజానికి ఆ ఒక్క క్షణం లో ఏ ఒక్కరు సర్దుకుపోయినా సమస్య వుండకపోయేది.
7. మగ పెళ్ళి వారితో కలిసి చిన్న తిరుపతి వెళ్ళిన చిన్నోడికి ఒక వ్యక్తి ఎదురుపడి “పెళ్ళి మొత్తానికి మీ అన్నదమ్ములు ఇద్దరూ హైలెట్ అని, చెరోపక్క నిల్చొని పెళ్ళి చేసారని , అది వాళ్ళ తండ్రి నేర్పిన సంస్కారం .ఎప్పుడూ ఇలాగే రామలక్ష్మణులు లాగ వుండండి “ అని అంటాడు. మనం రోజూ చూసే వ్యక్తి, లేదా సంఘటన లో గొప్పదనం ఒక్కోసారి మనకి వేరే వాళ్ళు వచ్చి చెప్పేవరకు అర్ధంకాకపోవచ్చు. మనం చేసే తప్పు కూడా ఎవరో గుర్తు చేసేవరకు కూడా గుర్తు రాకపోవచ్చు.ఎన్నో ఈగోల అడ్డు గోడలు గీసుకోవడం వలన, కమ్యూనికేషన్ గ్యాప్ వలన వచ్చేది అది. అది అర్ధమైన చిన్నోడు , పెద్దోడికి కాల్ చేద్దాం అనుకుంటాడు. కానీ మళ్ళీ ఏదో ఇగో అడ్డొస్తుంది. ఈలోపు అతనినుంచే ఫోన్ వస్తుంది. కానీ ఎలా మొదలెట్టాలో పెద్దోడికి అర్ధం కాదు. చివరికి “ ఆరోజు పూల కుండీ ఎందుకు తన్నావురా “ అంటాడు. అది అతని ఎక్స్ ప్రెషన్. అది చిన్నోడికి అర్ధమై అతని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తాడు. ఒకరికి ఒకరు ఎదురవుతారు. మళ్ళీ కధ మొదటికే వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఈగోలు పోయాయి కానీ, మామూలు అవ్వడానికి టైం పడుతుంది అందుకే దగ్గరికి వచ్చిన చిన్నోడిని చూసి “ఏరా తిన్నావా?” అని అడుగుతాడు. అలా వాళ్ళిద్దరూ వారి ఈగోలని ఆ క్షణానికి కప్పి పుచ్చుకుంటారు. ఒక్క క్షణం ఆ రోజు గొడవ ఎందుకు జరిగిందో ఆలోచిస్తే సరిపోయేది. కానీ ఆలోచించరు . అదే డ్రామా లో వున్న గొప్పదనం. సన్నివేశాలు నిశితంగా పరిశీలిస్తే గాని ఈ లేయర్స్ దొరకవు.
8. ఈసారి హైదరాబాద్ లో ఎవరో జాబ్ ఇస్తానంటే చిన్నోడితో కలిసి వెళ్ళిన పెద్దోడు తన కోపంతో ఈ అవకాశం కూడా కోల్పోతాడు. అయితే ఈలోగా సమంతా చిన్నోడిని లంచ్ కి పిలిచి ఇంట్లో అందరికీ పరిచయం చేసి వాళ్ళ మధ్య వున్న విషయం అందరికీ చెప్పాలనుకుంటుంది. అక్కడికి వచ్చిన చిన్నోడిని రావు రమేష్ అవమానం చెయ్యబోతాడు. దానికి అతను సమాధానం కూడా చెబుతాడు. “ మీ పెద్దోడిని ఎవడికైనా చూపించండ్రా..ఆడు ఇలాగే గ్లాస్ నిండా నీళ్ళు ఇవ్వలేదని అన్నందుకు తెగ గొడవ చేసేసాడు” అంటాడు. అప్పుడు మొదటిసారి చిన్నోడికి ఆ రోజు జరిగిన విషయం అర్ధమవుతుంది. అతనికి వార్నింగ్ ఇచ్చి అక్కడనుంచి లేచోచ్చెస్తాడు. తన ప్లాన్ అంతా పాడైనందుకు చిన్నోడి వెనకాల పరిగెడుతూ వచ్చేసి ఏదో మారాం చేస్తూ వుంటుంది సమంత . ఇలా ఇద్దరూ నడుస్తూ వుండగా పెద్దోడిని గుద్దేస్తారు. అక్కడే ఇంకోసారి అతని అనుమానం బలపడుతుంది. ముందు సన్నివేశంలోనే వాళ్ళిద్దరి మధ్యా ఏమి లేదు అంటాడు చిన్నోడు. ఇలా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయేసరికి ఏం చేయాలో అతనికి అర్ధం కాదు. అనుకున్నట్టుగానే పెద్దోడు అలిగి హైదరాబాద్ నుంచి చెప్పకుండా వెళ్ళిపోతాడు. చిన్నోడు కూడా ఈ విషయం లో చిరాకు పడతాడు.
9. ఇలా ఇద్దరి మధ్యా వున్న గ్యాప్ ఇంకా పెరిగిపోతుంది, ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యలు.కానీ ఇద్దరికీ ఈగోలు, చెపితే ఎదుటివాడు ఏమనుకుంటాడో అన్న ఫీలింగ్ అడ్డోస్తాయి.
10. ఈలోగా సీత ని చూసుకోడానికి పెళ్ళి సంభందం వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎదురుగా సీత వున్నప్పుడే పెద్దోడు వస్తాడు. అతనికి అన్నీ పనులూ చేసి పెట్టేది సీతే. నిజానికి సీతకి కూడా ఆ సంభందం ఇష్టం వుండదు. అందుకే అతను వచ్చే సమయానికి “ పిలవకూడదు ..పిలవకూడదు” అనుకుంటుంది. అతను పిలవాలి, తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి సంభందం క్యాన్సిల్ అవ్వాలని ఆమె కోరిక. చివరికి “ ఏయ్” అని పెద్దోడు పిలుస్తాడు. ఆమె అక్కడినుంచి పారిపోతుంది. పెద్దోడిని కాదని ఈ సంభందం తెచ్చిన వాళ్లందరూ అవాక్కయ్యిపోతారు.
11. ఈలోగా ప్రకాష్ రాజ్ కి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ లో చేరతాడు. అక్కడికి చిన్నోడు వచ్చినా , ఇంకా ఇద్దరూ ఎడమొహం , పెడమొహం గానే వుంటారు. ప్రకాష్ రాజ్ డిశ్చార్జ్ అయ్యాక జయసుధ అతనితో అంటుంది ..” పెద్దోడికి మీరు ఒకసారి చెప్పి చూడండి “ అని. “ చిన్నోడికి చెప్పావా” అని అడుగుతాడు. “ చిన్నోడి గురించి అయితే పెద్దోడికి చెప్పమంటారు, పెద్దోడి సమస్య చిన్నోడికి చెప్పమంటారు..ఏంటండి” అని అడుగుతుంది. “ వాళ్ళిద్దరూ చూసుకుంటారు లే” అంటాడు.అంత నమ్మకం అతనికి.
12. చివరికి సీత కోరిక మీద భద్రాచలం వెళ్తారు. అక్కడకి రావు రమేష్ ఫ్యామిలీ కూడా వస్తుంది. వీళ్ళని చూసి ఇంకా పంతంతోనే వుంటాడు ఈయన. కానీ ప్రకాష్ రాజ్ కి రాముల వారి పల్లకీ మోసే అవకాశం అతని మంచితనం వలన వస్తుంది.డబ్బుతో వచ్చే గొప్పతనం కాదది. అది చూసి రావు రమేష్ సిగ్గు పడతాడు. సరిగ్గా అదే సమయం లో అక్కడ మంటలు చెలరేగుతాయి. పెద్దోడు చిన్నోడు దైర్య సాహసాలు ప్రదర్శించి అందరినీ రక్షిస్తారు. అందరూ వీళ్ళని మెచ్చుకుంటారు. ఇది చూసి తన లెగసీ ని కాపాడుతున్న కొడుకులిద్దరినీ కూర్చోపెట్టి “ సమాజానికి ఇంతకంటే ఏం ఇవ్వగలంరా...మంచి కుటుంబం తప్ప. మీరు ఇద్దరూ ఈ జన్మకే అన్నదమ్ములు, తరవాత ఎవరికి ఎవరో” అని అతని జీవితపు ఫిలాసఫీ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ క్షణంలో ఇద్దరిలో వున్న అడ్డుగోడలు తొలగిపోయి కలుస్తారు. మనసులలో గూడు కట్టుకున్నవన్నీ కడిగేసుకుంటారు. వాళ్ళ జీవితపు విధానం మార్చుకోవాలనుకుంటారు.
ఇదంతా మళ్ళీ సీత దూరం నుంచి చూసి “నాకు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసు “ అంటూ ఏడుస్తుంది.
చివర్లో సీతకి పెద్దోడికి పెళ్ళి అవ్వడంతో కధ సుఖాంతం అవుతుంది.
నిజానికి ఇది అన్న మాట జవదాటని రామలక్ష్మణుల కధ కాదు.
ఆస్తి కోసం కొట్టుకు చచ్చే బారతం లోని పాత్రల్లా వుండే కధ కాదు...ఇద్దరు హీరోల కధ కూడా కాదు.
మనకి నిజ జీవితంలో ఎదురుపడే సాధారణమైన ఇద్దరు అన్నదమ్ములు, తండ్రి మంచితనం తాలుకా లెగసీ నిలబెట్టడానికి వాళ్ళ మధ్య నున్న ఇగోల అడ్డుగోడలు ఎలా పగలుగొట్టారు అని చూపించే కధ. అలా కధ పైపైన చెబుతూ లోపల ఇంకొ లేయర్ గురించి చెబుతాడు దర్శకుడు.నిశితంగా చూస్తే తప్ప సీన్ లో గొప్పతనం , ఇంకొ లేయర్ మనకి అర్ధం కావు. అలాగే సంభాషణలు కూడా సందర్భోచితంగా, పాత్ర తాలుకా మనస్తత్వం లోంచి వస్తాయి.
రెండోసారి చూస్తే నాకు అర్ధమైనది ఇది. మూడోసారి చూస్తే ఇంకెలా అర్ధమవుతుందో చూడాలి.
I complete agree with u, infact it happened same with me too. I didnt like it on first time but loved after watching it again. And I used to say the same to n number of people.
ReplyDeleteUr review, I liked it very much. Would be much better if you have used complete telugu words rather that few english words like కమ్యూనికేషన్, అనాలిసిస్, ఈగో, ఫిక్స్, జెలసీ, హార్ట్,కన్విన్ etc. But again, its so nice.
NOTE: I would like to write my comments in telugu but google translate didnt supported and I dont have any other editor too.
Last but not least, I learned new word "ఉపోద్గాతం" (ofcourse enjoyed the review too).